అలరించిన ఆటా జానపదం
అంతర్జాలం వేదికగా అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆదివారం అక్టోబర్ 1, 2023 న నిర్వహించిన తెలంగాణ జానపద సాహిత్యం అంశంపై జానపద గీతాలు విశ్లేషణాత్మకమైన కార్యక్రమం శ్రోతలను మరియు వీక్షకులను అలరించింది. సాహిత్య విభాగం అధిపతి మరియు పాలకమండలి సభ్యురాలు శారద సింగిరెడ్డి అధ్యక్షతన జరిగిన అత్యంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి ఆటా సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి మాధవి దాస్యం స్వాగత ప్రసంగం చేయగా, రవి తుపురాని, వీరన్న పంజాల గాయని గాయకులను సభకు పరిచయం చేసారు.
కార్యక్రమానికి సంచాలకత్వం వహించిన వాగ్భూషణ పురస్కార గ్రహీత,సంస్కృతాంధ్ర పండితులు నంది శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత గల సంస్థగా, విస్తృతమైన సాంస్కృతిక మరియు సాహిత్య కార్యకలాపాలను నిర్వహిస్తూ, వివిధ కళారూపాలను వెలికితీయడంలోను, యువ కళాకారుల ప్రతిభను వెలికితీయడంలోను ముందుండే అమెరికా తెలుగు సంఘం (ఆటా) తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవలు అనుపమానం అని కొనియాడారు. సంగీతంలోని సప్తస్వరాలు ప్రకృతిలో నుండే గ్రహించారని, ప్రకృతిని, మానవ జీవితాన్ని వినిపించే జానపదుల గుండె చప్పుడే జానపదం అని అలాంటి జానపద గీతాలతో ఆలపించిన యువ జానపద కళాకారులు బొడ్డు దిలీప్ కుమార్, నక్క శ్రీకాంత్, మరియు కుమారి ముకుందలు అభినందనీయులు అన్నారు. ప్రతీ జానపద గేయం అర్ధం పరమార్ధం వివరించారు.
తదనంతరం ఈకార్యక్రమంలొ ఆటా అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని మాట్లాడుతూ ప్రతి భాషకు, సాహిత్యానికి మూలం జానపద సాహిత్యమని, ఇది మౌఖిక మరియు సదాచార సాహిత్యంగా పల్లెలందు ఈనాటికి మిగిలి ఉందని, తెలుగు జానపదాలు ముఖ్యంగా తెలంగాణా జానపదాలు సరళమైన భాషా సంవిధానంతో సామాన్య జీవుల శ్రమైక జీవన విధానం నుండి, వివిధ జాతుల సామాజిక, సాంస్కృతిక జీవన శైలి నుండి పుట్టింది. గేయాలుగా, కథలు, పొడుపు కథలు, కళారూపాలుగా, సామెతలు జానపద వాఙ్మయము ఒకరి నోటి నుండి మరొకరికి ఒక తరం నుండి మరొక తరానికి విస్తరించబడుతూ వస్తున్నదని తెలియజేసారు.













