ఆ లక్ష్యాన్ని సాధించడానికి తొందరేమీ లేదు
ఉత్తరకొరియా అంతిమంగా పూర్తి అణు నిరాయుధీకరణ చేపట్టాలని తాను కోరుతున్నానని, అయితే ఆ లక్ష్యాన్ని సాధించడానికి తానేమీ తొందరపడడం లేదని, షెడ్యూల్‌ను ప్రకటించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే వారం హనోయ్‌లో కిమ్‌ను కలుసుకోవడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. పూర్తి అణు నిరాయుధీకరణ తమ లక్ష్యమైనప్పటికీ ఇప్పటికీ ఆంక్షలు అమల్లో వున్నందున, పైగా అణు, క్షిపణి పరీక్షలకు ఉత్తరకొరియా దూరంగా వున్నందున మాకేమీ తొందరలేదు. ఒకవేళ పరీక్షలు కొనసాగితే మాత్రం అప్పుడు పరిస్థితి మరోలా వుంటుంది అని అన్నారు. ప్రస్తుతానికి అంతా సానుకూలంగానే వుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కిమ్‌తో సమావేశం ముగిసిన అనంతరం ఆ వివరాలన్నింటినీ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్ ఫోన్లో చర్చించే అవకాశం వుందని ట్రంప్ చెప్పారు. దాదాపు అరగంట పాటు కొనసాగనున్న ట్రంప్-కిమ్ సమావేశం జయప్రదం కావడానికి సహకరించేందుకు గల అవకాశాలపై ట్రంప్‌తో చర్చించినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవన కార్యాలయం తెలిపింది.













