America: అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు
అమెరికాలోని వివిధ నగరాల్లో దీపావళి (Deepavali) వేడుకలు వైభవంగా జరిగాయి. ఇండియన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడితో సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు పాల్గొన్నారు. పలు రాష్ట్రాల్లో దీపావళి సందర్భంగా సెలవులను ప్రకటించడం విశేషం.
వైట్‌హౌజ్‌లో…
అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు ట్రంప్ ఈ వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐ లైక్ ఇండియన్స్ అంటూ.. భారత ప్రధాని మోదీపైనా ప్రశంసలు గుప్పించారు. ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రాతోపాటు ఇతర అధికారులు, భారత సంతతి వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మోదీకి ఫోన్ చేశారు. ‘మీ ఫోన్ కాల్, దీపావళి శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. ఈ వెలుగుల పండగ సాక్షిగా మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు సదాశయంతో, ఉగ్రవాదంపై పోరాటంలో ఉమ్మడిగా కలిసి నిలిచి ప్రపంచానికి వెలుగులను పంచడాన్ని కొనసాగించాలి’ అని బుధవారం ఎక్స్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తరువాత ట్రంప్ మాట్లాడుతూ, భారత్, పాక్ సంబంధాలపై ప్రధాని మోదీతో చర్చించానని ట్రంప్ తెలిపారు. శ్వేతసౌధంలో దీపావళి వేడుకల సందర్భంగా మరోసారి రష్యా చమురు అంశాన్ని ట్రంప్ ప్రస్తావించారు. రష్యా నుంచి ముడి చమురును మరీ అతిగా భారత్ కొనొద్దని మరోసారి స్పష్టం చేశారు. ‘ప్రధాని మోదీ గొప్ప నేత. నాకు మంచి స్నేహితుడు. వాణిజ్య చర్చల ద్వారానే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించా’ అని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి పేర్కొన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా భారత ప్రజలను, ప్రధాని మోదీని ట్రంప్ ప్రశంసించారు. రెండు దేశాలు మంచి సంబంధాలను కొనసాగిస్తున్నాయని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని భారత ప్రధాని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
టెక్సాస్‌లో…
టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అధికారిక నివాసంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన సతీమణి సిసిలియా అబ్బాట్‌తో కలిసి గవర్నర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని కొంతమంది ప్రవాస భారతీయ నాయకులను గవర్నర్ ఆహ్వానించారు. వెండి దీప స్తంభాల్లో జ్యోతులను గవర్నర్ దంపతులు వెలిగించి సంప్రదాయబద్ధంగా వేడుకలను ప్రారంభించారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తూ టెక్సాస్ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు వారు కృతజ్ఞతలతో పాటు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అతిథులందరినీ ఆప్యాయంగా పలకరించి అందరితోనూ ఫొటోలు దిగారు. భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. అనంతరం దీపావళి కానుకలిచ్చి వీడ్కోలు పలికారు. గత 11 ఏళ్లుగా గవర్నర్ దంపతులు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ ఏడాది ఏర్పాట్లను సమన్వయ పరిచారు.
ఈ వేడుకలకు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీ మంజునాథ్ దంపతులు, టెక్సాస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. ఆ రాష్ట్రంలోని డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్‌లాండ్ మొదలైన నగరాల నుంచి 100 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వీరిలో డా.ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండువ, నీలిమ గోనుగుంట్ల, ఆషా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కల్యాణ్దుర్గ్తో పాటు వారి కుటుంబ సభ్యులున్నారు. భారత్- అమెరికా మధ్య సంబంధాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్న టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్‌కు ప్రవాస భారతీయులందరి తరపున డా.ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రవాస భారతీయుల ముఖ్యమైన అన్ని ఉత్సవాలకు గవర్నర్ హాజరవుతున్నారన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో డాలస్‌లో జరిగిన గాంధీ 150వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని డా.ప్రసాద్ తోటకూర గుర్తుచేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు మరోసారి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కాలిఫోర్నియాలో…
కాలిఫోర్నియాలో కూడా దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు అసోసియేషన్లతోపాటు, ఎన్నారై సంఘాలు కూడా దీపావళి వేడుకలను నిర్వహించాయి. కాలిఫోర్నియా గవర్నర్ దీపావళిని పురస్కరించుకుని సందేశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. భారతీయులకు శుభకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు దీపావళికి సెలవు ఇవ్వాలన్న బిల్లుకు ఆమోదముద్రవేసి భారతీయులపై తనకు ఉన్న గౌరవాన్ని తెలియజేశారు.







