స్వర్గీయ డా. ప్రియాంక గారికి డాలస్ ఫోర్టువర్థ్ నగరవాసుల శ్రద్ధాంజలి
కమ్యూనిటి నాయకులు, నగర ప్రముఖులందరూ డిసెంబర్ 1, 2019 ఆదివారం సాయంత్రం సమావేశమై కొవ్వత్తులతో, పూలతో స్వర్గీయ డా. ప్రియాంక రెడ్డి గారికి జాయి ఈవెంట్ సెంటర్, ఫ్రిస్కోలో శోక తప్తమైన హృదయాలతో శ్రద్ధాంజలి ఘటించారు.
డాలస్ ఫోర్టువర్థ్ కమ్యూనిటి నాయకులు డా. ప్రసాద్ తోటకూర, అజయ్ రెడ్డి, శ్రీధర్ కొరసపాటి,రావ్ కలవల , గోపాల్ పొన్నంగి, జానకి మందాడి, రఘువీర్ బండారు, పవన్ గంగాధర, చిన్న సత్యం వీర్నపు, శ్రీకాంత్ పోలవరపు, చంద్ర పోలీస్, శారద సింగిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, సుధాకర్ కలసాని, రవికాంత్ రెడ్డి మామిడి, రామ్ అన్నాడి, అశోక్ కొండల, వేణు భాగ్యనగర్, నరేష్ సుంకిరెడ్డి, జయ తెలకపల్లి, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, లింగా రెడ్డి అల్వా తదితరులు ఈ శ్రద్ధాంజలి కార్యక్రమానికి పిలుపు నివ్వగా పెద్ద మొత్తములో నగర వాసులంతా తరలి వొచ్చారు. నగరములో నివసిస్తున్న స్వర్గీయ డా. ప్రియాంక గారిబంధువులు అభినవ్ రెడ్డి, సింధూరి కూడా హాజరు అయ్యారు. ఈ దుర్ఘటన విన్న ప్రవాస భారతీయుల హృదయాలు కన్నీరుగా మారయని తెలియ చేస్తూ, వారి కుటుంబ సభ్యలకు సంతాపాన్ని తెలియ చేసారు. డా. ప్రియాంకగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.
యింతటి ఘాతుకానికి కారకులైన ఆ మానవ మృగాలపై కఠిన చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రంగాన్ని, న్యాయవ్యవస్థని కోరారు. ఇలాంటి ఘోరమైన ఆకృత్యాలు దేశ వ్యాప్తంగా ఎన్నో జరుగుతున్న మన న్యాయవ్యవస్థ,ప్రభుత్వం, చట్టం సరైన రీతిలో కఠినమైన చర్యలు తీసుకోకపోవడం మూలంగానే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాజకీయ స్వలాభాల కోసం,రాజ్యాంగ సవరణలు చేయకుండా నేటి నాయకులు దేశములో జరుగుతన్న ఈఆకృత్యాలను ఖండిస్తున్నాము అంటున్నారే కానీ ఈసంఘటనలకు కారకులైన దోషులను శిక్షించడానికి ఎన్నో సంవత్సారాలు కాలయాపన చేస్తున్నారని వారి ఆగ్రహం వ్యక్తం చేసారు.
పాఠశాలల్లో పాట్యంశాలతో పాటు సందర్భాను సారంగా, ఆపదలలో ఉన్నప్పుడు, పోలీస్ సిబ్బందికి , ఆసుపత్రి సిబ్బందికి, దగ్గరలో నున్న వారికి సమాచారం అందచేసే శిక్షణని యివ్వాలని కోరారు. ఇలాంటి దుర్ఘటనలు మరల జరగకుండ చూసుకోవాలని ముక్త కంఠముతో ప్రవాస భారతీయులంతా ప్రభుత్వాన్ని కోరుకున్నారు. శ్రద్ధాంజలి కార్యక్రమానికి హాజరయిన టివి5, టివి9, యెన్టీవి,వి6 మీడియా మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియచేసారు.













