హెచ్-4 రద్దు తో అమెరికాకే నష్టం
అమెరికా జారీ చేసే హెచ్-4 వీసాలకు వర్క్పర్మిట్ను రద్దు చేయాలని ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ ఐటీ పరిశ్రమ, ఫేస్ బుక్ వంటి దిగ్గజ సంస్థలు, పలువురు శాసనకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. హెచ్-1బీ వీసాపై అమెరికా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నవారి జీవిత భాగస్వాములకు హెచ్-4 వీసా అమెరికాలో పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఈ సదుపాయాన్ని ఒబామా ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టాడు. ఈ వీసాదారుల్లో ఎక్కువ శాతం మంది భారతీయులే ఉన్నారు. అయితే ట్రంప్ ప్రభుత్వం హెచ్-4 వీసాదారులకు పని అనుమతి రద్దు చేయాలని ప్రతిపాదించింది. దీనిపై పలు రంగాల నుంచి నిరసన వ్యక్తం అవుతున్నది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది అని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా పనిచేసే ఎఫ్డబ్ల్యూడీ.యూఎస్ అనే సంస్థ పేర్కొన్నది. ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టాప్ ఐటీ కంపెనీలు కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేశాయి. హెచ్-4 వీసాలకు పని అనుమతి రద్దు చేస్తే హెచ్-1బీ వీసాదారులు ఒక్కరే తమ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారుతుందని, ఇది ఆ కుటుంబ ఆర్థిక స్థోమతను దెబ్బతీస్తుందని పేర్కొన్నది. వారు చెల్లించే పన్నులు, వారి ఖర్చులు తగ్గి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని వివరించింది.













