తానా పుస్తక మహోద్యమం ప్రారంభం
తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన “పుస్తక మహోద్యమాన్ని” తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అట్లాంటా నగరంలో గురువారం పలువురు స్నేహితులకు వివిధ పుస్తకాలను బహుమతులుగా అందజేసి లాంఛనంగా ప్రారంభించారు. పుస్తకాలను కొని మిత్రులకు, బంధువులకు, పిల్లలకు బహుమతులుగా అందించే అక్షరాల పండుగ అని, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ బృహత్ యజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏ సందర్భంలోనైనా సరే తమకు ఇష్టమైన పుస్తకాలను కొనుగోలుచేసి ఆత్మీయులకు బహుమతులుగా అందజేసే అలవాటును ప్రోత్సహించడం, కనీసం పాతిక వేల పుస్తకాలను పాఠకుల చేతుల్లోకి తీసుకువెళ్ళే లక్ష్యంగా సాగుతున్నామని, అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ పుస్తక మహోద్యమానికి అనేక సాహితీ సంస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, రచయితలు, పాఠకుల నుండి తొలినుంచే విశేష స్పందన లభిస్తోందని, ఈ కార్యక్రమం వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఒక ఉద్యమంగా సాగుతుందని, అందరూ పాల్గొని ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయమని కోరారు.
మీరు బహుకరిస్తున్నప్పుడు తీసిన ఫోటోలను, కొన్ని వివరాలను ఈ క్రింది లింక్ లో పొందుపరచినట్లితే మీ ఫోటోలను తానా వెబ్ సైట్ లో నిక్షిప్తం చేసి, తానా సంస్థ ద్వారా మీకు “పుస్తక నేస్తం” అనే ప్రశంసాపత్రం అందజేయబడుతుంది.
https://bit.ly/TANAPUSTAKAMAHODHYAMAMREG













