ఒక రక్తపరీక్షతో 8 కేన్సర్లు గుర్తింపు
ప్రాథమిక స్థాయిలో ఎనిమిది సాధారణ కేన్సర్ రకాలను గుర్తించడంలో ఉపకరించే ఏకైక రక్త పరీక్షను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంతేకాక దీని ద్వారా కేన్సర్ దేహంలో ఏ ప్రాంతంలో వచ్చిందీ కనుగొనవచ్చు. ఈ రక్త పరీక్షకు కేన్సర్ సీక్ అని నామకరణం చేశారు. ఇది రక్తంలో ఎనిమిది కేన్సర్ ప్రొటీన్ల స్థాయిలను మదింపు చేస్తూనే రక్తంలో పరిభ్రమిస్తున్న డీఎన్ఎ నుంచి కేన్సర్ జన్యువు పరివర్తనల ఉనికిని కనుగొంటుంది. అమెరికాలో 60 శాతానికి పైగా కేన్సర్ మరణాలకు కారణమైన ఎనిమిది కేన్సర్ రకాలను కనిపెట్టడాన్ని కేన్సర్ సీక్ లక్ష్యంగా చేసుకుంది. ఈ పరీక్ష పరిధిలోకి వచ్చే కేన్సర్లలో ఐదింటికి ప్రస్తుతం ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ లేదని అమెరికాలో జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఆంకాలజీ మరియు పాథాలజీ ప్రొఫెసర్ నికోలస్ పపడోపలోస్ తెలిపారు.













