ఆర్థికాభివృద్ధిలో భారతీయుల కృషి అమోఘం : జో బైడెన్
అమెరికా ఆర్థికాభివృద్ధిలో భారతీయ అమెరికన్లు పోషిస్తున్న పాత్ర మరవలేనిదని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కితాబునిచ్చారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే హెచ్-1బీ వీసాలు, చట్టబద్ధ వలసల విషయంలో ఇబ్బందుల్ని తీరుస్తానని, ప్రతిభావంతులు అగ్రరాజ్యానికి వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. భారతీయ అమెరికన్లలో ఉన్న కష్టపడి పనిచేసే తత్వం, వ్యాపార రంగంలో దూసుకుపోయే చొరవ, అమెరికాను అగ్రపథంలో నిలబెట్టడంలో కీలక పాత్ర వహిస్తున్నాయని చెప్పారు. అయినా వారి కృషి గురించి తగినంతగా మనం మాట్లాడడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దృశ్యమాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
సిలికాన్ వ్యాలీ పునాదుల నుంచి వ్యాపార రంగాల వరకు అన్నిటా భారతీయుల పాత్ర ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల కంపెనీలు కొన్నింటికి భారతీయులే నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా, ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారు. వలసవాదుల దేశంగా అమెరికా కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం హెచ్ 1బీ వీసాల విషయంలో హానికర చర్యలు తీసుకున్నారు. జాతులపరమైన అన్యాయానికి ఒడిగట్టారు. తమ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని అమెరికాకు వలస వచ్చిన తల్లిదండ్రులంతా కలవరపడుతున్నారు. నేను అధ్యక్షుడినయ్యాక పరిస్థితులు మారుస్తా. ఆర్థిక రంగాన్ని విలువల్ని ప్రతి బింబించే వలస విధానాన్ని తీసుకువస్తా అని బైడెన్ హామీ ఇచ్చారు.













