అతడిని పట్టిస్తే 70 లక్షల బహుమతి : అమెరికా ఎఫ్‌బీఐ
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు ఓ భారతీయుడి కోసం వేటాడుతున్నారు. భార్యను హత్య చేసి స్వదేశానికి పరారయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడిని పట్టిస్తే 70 లక్షల రూపాయల బహుమతి కూడా ఇస్తామని సంస్థ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే, గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ (24), పాలక్(21) దంపతులు. వారిద్దరూ అమెరికాలోని హనోవర్ మేరీల్యాండ్‌లోని దండిన్ డోనట్ స్టోర్‌లో పని చేసేవారు. 2015 ఏప్రిల్ లో పాలక్ స్టోర్‌లోని వంట గదిలో మృతదేహంగా కనిపించింది. ఆమె ఒంటిపై తీవ్ర గాయాలు కనిపించాయి. ఈ ఘటన జరిగిన రోజు నుంచి ఆమె భర్త భద్రేశ్ కుమార్ కూడా కనిపించకుండా పోయాడు.
ఈ హత్య ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన ఎఫ్‌బీఐ స్టోర్‌లో సీసీ కెమెరాలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. పాలక్ చనిపోవడానికి ముందు దంపతులు ఇద్దరు స్టోర్ వంట గదిలోకి వెళ్లినట్లు అందులో రికార్డుయి ఉంది. ఆ తరువాత భద్రేశ్‌కుమార్ ఒక్కడే వంట గది నుంచి బయటకు రావడం కనిపించింది. స్టోర్ నుంచి ఒక్కడే బయటకు వచ్చిన భద్రేశ్ కాలినడక ఇంటికి చేరుకున్నాడు. తన వ్యక్తిగత సామాన్లు తీసుకొని సమీపంలోని విమానాశ్రయానికి వెళ్లి పరారయ్యాడని అమెరికా పోలీసులు భావిస్తున్నారు. అతను భారత్‌లోనే ఉండి ఉండవచ్చన్న అనుమానంతో ఎఫ్‌బీఐ ఈ ప్రకటన జారీ చేసింది.













