టెక్సాస్ కాల్పుల ఘటనపై ఆటా స్పందన.. బాధితులకు సాయం చేసేందుకు ముందడుగు
టెక్సాస్లోని ప్రముఖ మాల్లో కాల్పుల ఘటనపై అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) స్పందించింది. ఈ ఘటనపై ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇలాంటి అమానవీయ ఘటనలను ఆటా ఖండిస్తుందని తెలుపుతూ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. టెక్సాస్లోని అలెన్లో ఒక మాల్లో మారిషియో గార్సియా అనే దుర్మార్గుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన తెలుగు యువతి ఐశ్వర్య తాటికొండ (27) కూడా కన్నుమూయడంపై ఆటా విచారం వ్యక్తం చేసింది. ఈ కాల్పుల్లో ఐశ్వర్యతో సహా క్రిస్టియన్ లాకూర్, డానియెలా మెండోజా, సోఫియా మెండోజా, క్యూ, సిండీ, జేమ్స్ చో, ఎలియో క్యూమానా రివాస్ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. దీనిపై స్పందించిన ఆటా.. డల్లాస్ మెట్రోపాలిటన్ ఏరియాలో ఎంతోమంది తెలుగు వారు ఉంటారని, అలాంటి ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరగడం ఆందోళన కరమని పేర్కొంది. ఈ దురదృష్టకర ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కూడా ఆటా సానుభూతి తెలిపింది. సమాజ సేవే ధ్యేయంగా పనిచేసే ఆటా.. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం చేసేందుకు కృషి చేస్తుందని వెల్లడిరచింది. అలాగే ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆటా డిమాండ్ చేసింది.













