ఏపీ విద్యార్థికి రూ.10 లక్షల లబ్ధి : అమెరికాలో గంటా
అమెరికాలో మంత్రి గంటా శ్రీనివాసరావు బృందం పర్యటిస్తోంది. ఒహియో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జాన్ క్యారీతో గంటా బృందం భేటీ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రాయితీ అంశంపై చర్చించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తుది ఎంవోయూ పై ఇరువురు మంత్రులు సంతకాలు చేశారు. దీంతో ఒహియో వర్సిటీల్లో చదివే స్థానిక విద్యార్థులతో సమానంగా ఏపీ విద్యార్థులు ఫీజు చెల్లించనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఒక్కొక్క ఏపీ విద్యార్థి రూ.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుందని మంత్రి గంటా తెలిపారు. మిగిలిన వర్సిటీలతో కూడా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్నామని, ఇప్పటికే రైట్ స్టేట్ వర్సిటీతో అవగాహన ఒప్పందం ఖరారు అయ్యిందని తెలిపారు. ఈ ఒప్పందం అమెరికన్ అకడమిక్ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపిన గంటా మెడికల్, ఇంజనీరింగ్ ఇలా అన్ని కోర్సులకు ఫీజు రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి గంటాతో పాటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్, ఉన్న విద్యామండలి సలహాదారు డాక్టర్ ఈదర వెంకట్ పాల్గొన్నారు.













