ఎపి విద్యార్థుల చదువులపై ఒహాయో రాష్ట్రంతో ఎపి ఒప్పందం
ఒహాయో విశ్వవిద్యాలయంలో చదివే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రాయితీలు ఇచ్చే విధంగా ఒహాయో రాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూను కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఎంఓయూలపై సంతకం చేశారు. ఒహాయో వర్సిటీల్లో చదివే ప్రతి విద్యార్థికి ఈ ఒప్పందం వల్ల 8.5 లక్షల నుంచి 10 లక్షల వరకు లబ్ది కలుగుతుంది. అమెరికన్ అకడమిక్ సంవత్సరం జనవరి నుంచి ఈ ఎంఓయు అమల్లోకి వస్తుంది. ఎంఓయును అనుసరించి రాష్ట్రంలోని ప్రతి యూనివర్సిటీతో ఒప్పందాలను ప్రభుత్వం చేసుకోనున్నది. ఇప్పటికే రైట్ స్టేట్ వర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరిందని మంత్రి గంటా తెలిపారు. ప్రతి సంవత్సరం ఒహాయోకు ఎపి నుంచి 3 నుంచి 4 వేల మంది విద్యార్థులు వెళుతున్నారని, ఈ ఎంఓయు వల్ల స్థానిక విద్యార్థులతో సమానంగా మన విద్యార్థులు కూడా ఫీజు చెల్లిస్తారని గంటా వివరించారు. ఈ ఎంఓయు అమలుకోసం రెండు ప్రభుత్వాల ఆధ్వర్యంలో కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. బ్యాచ్లర్, ఎంఎస్ నుంచి మెడికల్, ఇంజనీరింగ్ ఇలా అన్నీ కోర్సులకు ఫీజు రాయితీ వర్తింపు జరుగుతుంది.













