అమెరికా శాస్త్రవేత్తలు కీలక విజయం
క్యాన్సర్లపై పోరాటంలో అమెరికా శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్లు సహా వివిధ రకాల కణుతులను అంతం చేయగల సరికొత్త ఔషధాన్ని వారు అభివృద్ధి చేశారు. ప్రధానంగా చిన్నారుల్లో ప్రమాదకర న్యూరోబ్లాస్టోమానూ అది నయం చేయగలదు. ఏవోహెచ్ 1996గా ఈ ఔషధానికి నామకరణం చేశారు. 1996లో ఇండియానాలో జన్మించి న్యూరోబ్లాస్టోమా కారణంగా తొమ్మిదో ఏట కన్నుమూసిన అన్నా ఒలీవియా హీలీ అనే చిన్నారి జ్ఞాపకార్థం దానికి ఆ పేరు పెట్టారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిటీ ఆఫ్ హోప్ ఆసుపత్రిలో ఈ ఔషధానికి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మెదడు, అండాశయం, చర్మం, ఊపిరితిత్తులకు సోకే క్యాన్సర్లకు నయం చేయడం లోనూ ఏవోహెచ్ 1996 ఉపయోగపడగలదని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.













