మెల్ బోర్న్ లో దిగ్విజయంగా ముగిసిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
మెల్ బోర్న్ ఆస్ట్రేలియా లో నవంబర్ 3-4, 2018 తేదీలలో 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు దిగ్విజయంగా జరిగి పలురకాలుగా తెలుగు సాహిత్య చరిత్రలో మరొక నూతన అధ్యాయానికి నాందీ పలికింది. దానికి మొదటి కారణం ఈ సదస్సు ఆస్ట్రేలియా ఖండంలో జరిగిన మొట్టమొదటి సాహితీ సదస్సు కాగా, మరొక కారణం తెలుగు భాషా సాహిత్యాలకి సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించి ఆ వెన్నెలని వెదజల్లే ప్రస్థానం లో భారత ఉప ఖండం, అమెరికాఖండం, ఐరోపా ఖండం, దక్షిణ ఆసియా ఖండాల తరువాత ఇప్పుడు ఆస్ట్రేలియా ఖండంలో 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా నిర్వహించబడడం మరొక కారణం.
మెల్ బోర్న్ సదస్సులో ఇంచు మించు ప్రతీ నిముషం ముందుగా వేసిన ప్రణాళిక ప్రకారం మంచి సమయ పాలనతో రెండు రోజుల సమావేశం జరగడం అందరినీ సంతోషపరిచింది. మొదటి రోజు ఉదయం అల్పాహారం, ప్రతినిధుల నమోదు అనంతరం సదస్సు వంగూరి చిట్టెన్ రాజు సహజ హాస్య చతురతతో ప్రారంభ వేదిక నిర్వహించారు. ఈ సదస్సుకు అనుకోని స్పందన ఆఖరి క్షణాలలో మాకు అందిన భారత ఉపరాష్ట్రపతి గౌ. ముప్పర్తి వెంకయ్య నాయుడు గారి విడియో సందేశ ప్రసారం జరిగింది. ఆ తరువాత మా సంప్రదాయం ప్రకారం ముందుగా మెల్ బోర్న్ & మలేషియా ప్రాంతాలలో బాలబాలికలకి తెలుగు నేర్పుతున్న 17 మంది తెలుగు ఉపాద్యాయుల సత్కారంతో ప్రారంభ సభ మొదలు అయింది. ముందుగా ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీని కట్టా గారు దేశ విదేశాల ప్రతినిధులకి స్వాగతం పలికారు. తన ప్రారంభోపన్యాసంలో “పద్మభూషణ్” ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విదేశాలలో, ముఖ్యంగా ఆస్ట్రేలియా తెలుగు సంఘం వారు మన భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణల పట్ల చూపుతున్న ఆసక్తికి అభినందనలు తెలిపారు. “అవధాన సరస్వతి” డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ సంస్కృతంతో సహా ఇతర భాషల పదాలు లేకుండా అచ్చ తెనుగు సొగసుని సోదాహరణంగా వివరించి సభికులని అలరించారు.
కేంద్ర సాహిత్య ఎకాడెమీ ప్రధాన కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాస రావు గారు తెలుగు భాషా సాహిత్యాలకి ఎకాడెమీ అనేక దశాబ్దాలగా అమలుచేస్తున్న ప్రోత్సాహక కార్యక్రమాలని శ్రోతలకి వివరించారు. ఈ సందర్భంగా సాహిత్య ఎకాడమీ వారు “అర్ధ శతాబ్దిలో లో అమెరికా తెలుగు కథ- 1964-2014” అనే చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన గ్రంధ ప్రచురణకి సంస్థాగత నిర్ణయం తీసుకుని, ఆ గ్రంధానికి ప్రధాన సంపాదకులుగా వంగూరి చిట్టెన్ రాజు (అమెరికా) & సి. మృణాళిని (హైదరాబాద్) లని నియమించినట్టు ప్రకటించారు. ప్రముఖ పాత్రికేయులు అప్పరసు కృష్ణారావు (ఢిల్లీ), తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ (హైదరాబాద్), సతీష్ వరదరాజు (సిడ్నీ) సముచిత ప్రసంగాలు చేయగా ఫ్రాన్స్ నుంచి వచ్చిన ప్రొఫెసర్ డేనియల్ నెజేర్స్ 2020 లో పారిస్ లో ఫ్రెంచ్ ప్రభుత్వ సహకారంతో ఇటువంటి సమావేశం నిర్వహించాలని తలపెడుతున్నట్టు వెల్లడించారు. ఆకెళ్ళ రాఘవేంద్ర తెలుగు సాహిత్యం తనకి జీవితానికి ఇస్తున్న స్ఫూర్తి మీద ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు.
తర్వాత శాయి రాచకొండ (హ్యూస్టన్) నిర్వహణలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. వీటిల్లో ప్రధానమైనది “కవితాస్త్రాలయ -2018” చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన గ్రంధం. ఆస్ట్రేలియాలో తెలుగు వారి ప్రస్థానాన్ని కూలంకషంగా విశదీకరించే వ్యాసాలూ, ఆస్ట్రేలియా రచయితల కథలు, కవితలు, వ్యాసాల ఈ గ్రంధానికి ప్రధాన సంపాదకులు మరియు సదస్సు ప్రధాన సమన్వయ కర్త అయిన రావు కొంచాడ గారు సమగ్రంగా సమీక్షించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఇటీవలి ప్రచురణలు అమెరికట్టు కథలు (వంగూరి చిట్టెన్ రాజు), సరికొత్త వేకువ & నాట్య భారతీయం (కోసూరి ఉమా భారతి), తీపి గుర్తులు (శంకర నారాయణ), వంశీ ప్రచురణలు కొత్త కథ 2017, కొత్త కథలు -2018, నేల మీద జాబిలి -అక్కినేని -బాలు శతగీత లహరి, రామ చంద్రమౌళి రచనలు (కాల నాళిక, మొదటి చీమ, తపస్సు), వడ్డేపల్లి కృష్ణ విరచిత శాంతి కవాటం & బాసర సరస్వతి మహిమ డీవీడీ, మారిషస్ వారి అన్నమయ్య పద కోశం పుస్తకాలు ఈ సదస్సులో ఆవిష్కరించబడ్డాయి. సదస్సు కు విచ్చేసిన ప్రతినిధులు అందరికీ ఆవిష్కరించబడిన పుస్తకాలతో సహా ఎనిమిది తెలుగు పుస్తకాలు ఉచితంగా బహుకరించబడ్డాయి.
తదనంతరం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి 23వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతలు గా నిలిచిన ఆస్ట్రేలియా తెలుగు రచయితలు రమాకాంత్ రెడ్డి (మెల్ బోర్న్) శారద మురళి (సిడ్నీ) లకి ప్రశంసా పత్రం నగదు బహుమతి సభా ముఖంగా అందజేయబడ్డాయి. తన నగదు బహుమతిని తిరిగి వంగూరి ఫౌండేషన్ వారికే విరాళంగా ఇచ్చి రమాకాంత రెడ్డి గారు సభికుల అభినందనలు అందుకున్నారు.
ఆ సదస్సులో ప్రసంగ వేదికలు ఆయా దేశాలకి ప్రత్యేకం గా కేటాయించబడడం ఒక విశేషం. ఈ తరహాలో సదస్సు రెండు రోజులలోనూ నాలుగు ఆస్ట్రేలియా ప్రసంగ వేదికలలో మెల్ బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, కెన్బేరా, అడిలైడ్, మొదలైన నగరాల నుండి శ్రీ కృష్ణ రావిపాటి, అరుణ నిమ్మగడ్డ, వేణుగోపాల్ రాజుపాలెం, ఉమా మహేష్ శనగవరపు, రమాకాంత్ రెడ్డి, శివశంకర్ పెద్దిభొట్ల, సారధి మోటమఱ్ఱి, ఉషా శ్రీదేవి శ్రీధర, నాగేందర్ రెడ్డి కాసర్ల, వేణుగోపాల్ రాజుపాలెం, యోగి వాల్హాతి, రుద్ర ప్రసాద్ కొట్టు, విజయ మాధవి గొల్లపూడి, అను మునుగంతి, శారద మురళి, సి,వి.రావు, మురళి ధర్మపురి, చారి ముడుంబి, భాస్కర రావు సరిపల్లి, మల్లిక్ రాచకొండ, ఊటుకూరి సత్యనారాయణ మొదలైన వారు అనేక అంశాల మీద ప్రసంగించారు. వాటిల్లో భాషా శాస్త్ర పరంగా ఉమా మహేష్ శనగవరపు (58 తెలుగు అక్షరమాల రహస్యాలు, వాటిని కాపాడుకోవలసిన ఆవశ్యకత, సులభంగా నేర్పే చిట్కాలు) ఉన్నత స్థాయిలో ఉంది. మురళి ధర్మపురి కవితలు, యోగి వాల్హాతి కథ సృజనాత్మకత నైపుణ్యం, రమాకాంత్ రెడ్డి ప్రసంగం సభికులని ఆకట్టుకున్నాయి. ఊటుకూరి సత్యనారాయణ గారి సినీ సమాచార సమగ్ర సేకరణ, ప్రచురణ, చిత్త శుద్ధి సభికులని ఎనలేని ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. ఆయన దశాబ్దాల కృషిని సారధి మోటమర్రి గారి సభికులకి సవివరంగా తెలియజేయడం ముదావహం. ఒక కేసీఆర్ గారి అనుచరుడిగా తెలంగాణా లో తెలుగు నేపధ్యంతో నాగేందర్ రెడ్డి కాసర్ల ప్రసంగం ఆసక్తికరంగా సాగింది.
ఆయా ఆస్ట్రేలియా వేదికలని వడ్డేపల్లి కృష్ణ, అప్పరసు కృష్ణా రావు, భారతి కందిమళ్ళ, రావు కొంచాడ సమర్ధవంతంగా నిర్వహించారు.
ఇక భారర దేశం రచయితల ప్రసంగాలకి కేటాయించిన రెండు వేదికలలో గ్రంధాలయాల పాత్ర మీద భారతి కందిమళ్ళ గారి సాధికార ప్రసంగం, లలిత సంగీత వికాసం మీద వడ్డేపల్లి కృష్ణ వివరణాత్మక ప్రసంగం, భారతంలో దాంపత్య సంయమనం మీద ప్రభల జానకి సోదాహరణ ప్రసంగం, తెలంగాణా మహిళా కవిత్వం మీద సమర్ధవంతంగా విహంగ వీక్షణం చేసిన ప్రొఫెసర్ త్రివేణి వంగారి ప్రసంగం, యోగ శాస్త్రాన్ని, సాహిత్యాన్ని అన్వయిస్తూ రాపర్తి శ్రీను ప్రసంగాలకి మంచి స్పందన లభించింది. అలాగే వంశీ రామరాజు గారి సుదీర్ఘ ప్రస్థానంలో సుమారు వంద మంది సాహితీ స్రష్టలతోతన వ్యక్తిగత పరిచయాలలో కొందరితో సానిహిత్యాన్ని సభికులతో పంచుకున్నారు. ఎప్పుడో వందలాది ఏళ్ల క్రిందటి కవుల గురించి ఈ నాడు మాట్లాడుకునే ఇటువంటి సాహితీ సదస్సులు నిరుపయోగం అనీ, మనకి మనం సంధించుకోవలసిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి అనీ బాబు గోగినేని అభిప్రాయపడ్డారు.
ఇక త్రివేణి వంగారి (నిజామాబాద్) నిర్వహణ లో జరిగిన న్యూజీలాండ్ వేదికలో డా. పద్మ గోవర్ధన మల్లెల కర్నాటక సంగీతంలో సాహిత్యం మీద చేసిన ఉత్తేజ పూరిత ప్రసంగం, వారాంతంలో పండుగుల మీద జ్యోతి మల్లికార్జున రెడ్డి సభికులతో పంచుకున్న విశేషాలు ఒక ఎత్తు అయితే న్యూజీలాండ్ తెలుగు సంఘం చరిత్ర, పురోగతి, భవిష్యత్ ప్రణాళికల మీద జగదీశ్వర రెడ్డి మగతల చేసిన సమగ్రమైన ప్రసంగం, మరో రెండేళ్ళ తర్వాత 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు న్యూజీలాండ్ లో నిర్వహించాలని చేసిన విజ్ఞప్తి ప్రతినిధులని ఆకట్టుకున్నాయి.
ఆకెళ్ళ రాఘవేంద్ర నిర్వహణలో జరిగిన మారిషస్ వేదికలో సంజీవ నరసింహ అప్పడు గారు మారిషస్ లో తెలుగు భాష, సాహిత్య, సంస్కృతుల వికాసంపై సమగ్రమైన ప్రసంగం చేశారు. రెండేళ్ళ తరువాత జరిగే 7వ ప్రపంచ సాహితీ సదస్సు మారిషస్ లో నిర్వహించడానికి ఆసక్తి వెలిబుచ్చారు.
ఇక రెండు రోజులలోనూ అందరినీ ఆకట్టుకుని, ఆశ్చర్యచకితులని చేసి వారి హృదయాలని చూరగొన్నది మలేషియా నుంచి డా. అచ్చయ్య కుమార్ రావు గారి నాయకత్వంలో వచ్చిన 29 మంది బృందం…అందులో ఉన్న ఐదో తరం తెలుగు చిన్నారి బాల బాలికలు. ఉదయశ్రీ చదలవాడ శిక్షణ లో వారు గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయ కవిత ఆలాపన, కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెనుగు తల్లి కవిత, అన్నింటికీ పరాకాష్టగా మలేషియా తెలుగు వారి మూడు వందల ప్రవాస జీవితాన్ని ముగ్గురు పదేళ్ళ ఐదో తరం మలేషియా తెలుగు అమ్మాయిలు రేఖ సరికొండ శిక్షణ లో బుర్ర కథ రూపంలో చేసిన ప్రదర్శన అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆ బుర్ర కథ కి, తెలుగు భాషా సాహిత్యాలని కాపాడుకోవాలి అని ఆ మలేషియా వారికి ఉన్న తపనకీ సభికులు చలించిపోయారు. అప్పటికప్పుడు ప్రభల జానకి గారు, యార్లగడ్డ వారు ఆ ముగ్గురికీ ఒక్కొక్కరికీ వంద డాలర్లు బహుమతి అందజేశారు. డా. అచ్చయ్య కుమార్ రావు గారు ఎంతో హుందాగా, సవినయంగా, మలేషియాలో తెలుగు కోసం తాము చేస్తున్న కృషిని వివరిస్తూ, సుమారు 5 మిలియన్ డాలర్ల వ్యయంతో యావత్ ప్రపంచంలో విదేశాలలో మరెక్కడా లేని విధంగా ఒక నాలుగు అంతస్తుల తెలుగు భవన నిర్మాణం కౌలా లంపూర్ లో పూర్తి చేసినట్టు ప్రకటించారు. త్వరలోనే మలేషియా ప్రధాన మంత్రి స్వయంగా అ తెలుగు భవనాన్ని జాతికి అంకితం చేస్తారు అని ప్రకటించారు. ఇంతటి ప్రగాఢమైన ప్రకటనలకి మెల్ బోర్న్ లో జరిగిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు వేదిక కావడం ముదావహం.
ఈ సదస్సులో రెండవ రోజు ప్రారంభ వేదికలో జరిగిన “అచ్చ తెనుగు కుదించిన కుదురాట”..అంటే “లఘు అవధానం”. సమయాభావం వలన పూర్తి స్థాయి అవధానానికి అవకాశం లేదు కాబట్టి, సభికులకి అచ్చ తెనుగు అవధాన ప్రక్రియని ఆస్ట్రేలియాలో తొలి సారిగా పరిచయం చెయ్యడానికి శతావధాన సరస్వతి డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంకల్పించారు. ఈ ప్రక్రియలో రావు కొంచాడ రావు సంచాలకులు గానూ, రమాకాంత్ రెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, ప్రసాద్ పిల్లుట్ల, ఉమా మహేష్ శనగవరపు, వేణుగోపాల్ రాజుపాలెం “అడుగరి”..అంటే పృచ్చకులుగా పాల్గొన్నారు. మొదటి దత్త పది పదాలు అస్ట్రేలియా, మెల్ బోర్న్, ఇండియా, ఢిల్లీ …రెండో దత్త పది పదాలు, వంగూరి, తాయ్ (Telugu Association of Australia), లోక్ నాయక్, సదస్సు…. వీటన్నింటినీ అవధాని పాలపర్తి గారు అలవోక గా పూర్తి చేసి అచ్చ తెనుగు ఔన్నత్యాన్ని ప్రతినిధులకి మరొక సారి గుర్తు చేశారు.
ఈ సదస్సులో మరొక ఆసక్తి కరమైన విశేషం శాయి రాచకొండ నిర్వహణలో జరిగిన “కథా పూరణ పోటీ”. ఇందులో ప్రసిద్ద రచయిత సత్యం మందపాటి గారి కథ ఒకటి తీసుకుని, అందులో ఆఖరి పేరాలు “కత్తిరించేసి” , మొదటి కొన్ని పేరాలు మాత్రమే ప్రతి నిధులకి ముందు రోజు ఇచ్చారు శాయి గారు. ఆసక్తి ఉన్న వారు ఆ రోజు రాత్రి ఆ కథని వారికి తోచిన రీతిలో “పూర్తి” చేసి మాకు ఇస్తే..అవి అన్నీ చదిబి ఈ కథా పూరణ బావుందో వారికి ఒక చిన్న బహుమతి ఇస్తాం అని శాయి గారు ప్రకటించారు. ఈ సదస్సులో ఈ కథా రచన పోటీకి అనూహ్యంగా 18 మంది స్పందించారు. అంతకంటే ఆశ్చర్యం …మలేషియా నుంచి వచ్చిన వారిలో 15 ఏళ్ల లోపు ఐదో తరం అమ్మాయిలు పాల్గొన్నారు….అయితే బహుమతి గెల్చుకున్న వారు ఆకెళ్ళ రాఘవేంద్ర. (హైదరాబాద్), విఠల్ (అమెరికా).
ఈ 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి పరాకాష్టగా తన 1963 లో తన 35వ ఏట ఆస్ట్రేలియాలో అడుగు పెట్టి, స్థిర పడిన తొలి ఆస్ట్రేలియా తెలుగు ప్రవాసి, ఆస్ట్రేలియా తొలి తెలుగు సంఘం అయిన సిడ్నీ తెలుగు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు వాహిని పత్రిక ప్రారంభకులు, రేడియో ప్రయోక్త, శతాధిక నాటక రచయిత, డా. దుర్వాసుల మూర్తి (వయసు 90) & మంగళ దంపతులకి కర్పూర దండలు, దుశ్శాలువా, కిరీటం, నగదు పురస్కారాలతో పాటు ఆకర్షణీయమైన సన్మాన పత్రం, పుష్పాభిషేకాలతో జీవన సాఫల్య పురస్కారం అత్యంత వైభవంగా జరిగింది.
తన ముగింపు ఉపన్యాసం లో “పద్మభూషణ్” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కేసీఆర్ నాయకత్వంలో తెలుగు భాష పట్ల తెలంగాణా ప్రభుత్వ విధాలని ప్రశంసిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ నిరాదరణ పట్ల విచారం వ్యక్తం చేశారు.
ఈ మెల్ బోర్న్ సదస్సు ప్రణాళిక, ఆచరణ, నిర్వహణలలో అత్యంత ప్రతిభ, ఆసక్తి, అనురక్తి చూపిస్తూ ఈ సదస్సు అఖండ విజయానికి కారకులైన అనేక మంది కార్య కర్తలలో ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీని కట్టా & లత, కార్యదర్సి డా. శ్రీ గుళ్ళపల్లి & కవిత, రావు కొంచాడ & ప్రత్యూష దంపతులు, అప్పటికప్పుడు అన్ని విషయాలూ అట్టే ఆకట్టుకుని అలవోకగా అన్నీ సవ్యంగా నిర్వహించిన ఆత్మీయురాలు షర్మిల చుక్క అజిత్, నమోదు బల్ల దగ్గర అంతా తానే అయిన లక్ష్మి, ప్రియాంక, ….వంశీ రామరాజు గారి అంకిత భావం….ఒకరా, ఇద్దరా .. పేర్లు తెలియని అనేక మంది స్వచ్చంద సేవకులు, మంచి భోజన సదుపాయం చేసిన బిర్యానీ మహల్ మిత్రులు, ఆడియో & విడియో ఏర్పాట్లు చేసిన వారు,…ఇలా ఎందరో మహానుభావులు..అందరికీ వందనాలు.
ఈ నివేదికలలో కొన్ని పొరపాట్లు ఉండే అవకాశం ఉంది. అందుకు క్షమాపణలు కోరుకుంటూ..
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
రెండు రోజుల మొత్తం సదస్సు విడియోలు: అన్నీ చూసే ఓపిక లేని వారికి కొన్ని ప్రత్యేక ఘట్టాల లంకెలు ఈ క్రింద ఇచ్చాను. ఇందుతో పాటు సదస్సు సమగ్ర సమీక్ష మరొక సారి జతపరుస్తున్నాను. అందులో ఆసక్తికరమైన ప్రసంగాలు ఈ విడి యోలలో వినవచ్చును.
https://onedrive.live.com/?id=F45B40616DCE309%2113965&cid=0F45B40616DCE309
కొన్ని ప్రత్యేక ఘట్టాల వీడియో లంకెలు:
వంగూరి చిట్టెన్ రాజు స్వాగత ఉపన్యాసం, ఆచార్య యార్లగడ్డ ప్రారంభోపన్యాసం, ఉపరాష్ట్రపతి గౌ. వెంకయ్య నాయుడు గారి సందేశం
శ్రీని కట్టా స్వాగత వచనాలు:
Life Time Achievement Award to Dr. Durvasula Murthy & Mangala
ఆచార్య యార్లగడ్డ లక్షీ ప్రసాద్ ముగింపు ఉపన్యాసం
కార్యకర్తల సత్కారం
వంగూరి చిట్టెన్ రాజుకు చిరు సత్కారం https://onedrive.live.com/?cid=0F45B40616DCE309&id=F45B40616DCE309%2114083&parId=F45B40616DCE309%2114080&o=OneUp
సదస్సు సమీక్ష, భవిష్యత్ ప్రణాళికలు
ఆఖరి అంశం గా ….
మెల్ బోర్న్ లో జరిగిన 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కు ఖర్చుల నిమిత్తం ఆర్ధిక సహాయానికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి విన్నపానికి స్పందించి సుమారు $2000 విరాళాలు అందించిన ఆత్మీయులు ఆకెళ్ళ, ఉమా భారతి, వి.కె రాజు, వేములపల్లి రాఘవేంద్ర చౌదరి, నాగరాజ్ టంగుటూరు, కోటి & ఇంద్రాణి పాలపర్తి, రవి గొర్తి, సుబ్బు జొన్నలగడ్డ ల గార్లకి FB ముఖంగా ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.













