Mayasabha: రివ్యూ ‘మయసభ’ వెబ్ సిరీస్ లో

వైయస్సార్ – చంద్రబాబు మిత్రులా? శత్రువులా? ఓటీటీలో దేవాకట్టా రాజకీయ మాయాజాలం!
తెలుగు టైమ్స్. నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్థ : హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్
నటీనటులు: ఆది పినిశెట్టి, చైతన్య రావు, సాయికుమార్, దివ్య దత్తా, నాజర్, రవీంద్ర విజయ్,
తన్య రవిచంద్రన్, భావన వజపండల్, చరిత వర్మ, శంకర్ మహంతి తదితరులు
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
సినిమాటోగ్రాఫర్స్ : సురేష్ రగుతు, జానశేఖర్ వీఎస్
ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, ఓటీటీ వేదిక : సోని లివ్
నిర్మాతలు: విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష
దర్శకత్వం: దేవ కట్టా, కిరణ్ జయ్ కుమార్
ఓటీటీ రిలీజ్ డేట్: 07.08.2025
సీజన్ 1- ఎపిసోడ్స్ : మొత్తం 9 (షుమారు 40 నిముషాలు)
Sonyliv Original OTT పై ఆగష్టు 7 నుండి స్ట్రీమింగ్ అవుతున్నాతెలుగు పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ ‘మయసభ’. దేవాకట్టా తెరకెక్కించిన పొలిటికల్ వెబ్ సిరీస్ ‘మయసభ’. ఆది పినిశెట్టి, (Aadi Pinishetty ) చైతన్య రావు,(Chaitanya Rao) పాత్రలు చూస్తే వైయస్సార్ – చంద్రబాబుగుర్తుకొస్తారు. పైగా లోగో లో ఇద్దరి షేడ్స్ తో అది నిజమైంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే? సోనీలివ్ ఓటీటీ కోసం దర్శకుడు దేవాకట్టా క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ ‘మయసభ’. ఆయనతో పాటు కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆది పినిశెట్టి, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, సాయి కుమార్, తాన్య రవిచంద్రన్, దివ్యా దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘మయసభ’ ప్రచార చిత్రాలు చూస్తే… తెలుగు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన దిగ్గజ నాయకులు నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu)- వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Dr.Y S Rajsekhar Reddy)పాత్రలు గుర్తుకు రావడం గ్యారంటీ. ఆది పినిశెట్టి పాత్రను చంద్రబాబు స్పూర్తితో, చైతన్య రావు పాత్రను వైయస్సార్ స్ఫూర్తితో రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఆ మాట అంటే దేవా కట్టా (Deva Katta)ఒప్పుకోరు. మరి, సిరీస్ ఎలా ఉంది? ఇందులో ప్లస్ – మైనస్ పాయింట్స్ ఏంటి? అనేది రివ్యూలో చూద్దాం!
కథ :
చిత్తూరు జిల్లా నర్సిపల్లి గ్రామానికి చెందిన కాకర్ల కృష్ణమ నాయుడు అలియాస్ కేకేఎన్ (ఆది పినిశెట్టి) యూనివర్సిటీలో ఉన్నత చదువులు రాజకీయాల్లో రాణించాలనుకొంటాడు. కడప జిల్లాలోని పులిచెర్ల గ్రామానికి చెందిన ఫ్యాక్షనిస్టు బాంబుల శివారెడ్డి (శంకర్ మహంతి) కుమారుడైన ఎంఎస్ రామిరెడ్డి అలియాస్ ఎంఎస్ఆర్ (చైతన్యరావు) తన తండ్రి వ్యవహారాలను వ్యతిరేకిస్తూ వైద్య వృత్తిని ఎంచుకుని కర్ణాటక డాక్టర్ కోర్స్ చదువుతూ చేత అయినంత సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఇద్దరు తమ జీవితంలో ఒకానొక సంఘటనలో… భావోద్వేగ పరిస్థితుల్లో ఊగిసలాడుతున్న సమయంలో కలిసి ప్రాణ స్నేహితులుగా మారిపోతారు. వీరి పరిచయం రాజకీయ అరంగ్రేటానికి దోహద పడుతుంది. అలా పరిచయమైనా వీరు ప్రదాన మంత్రి ఐరావతి బసు (దివ్య దత్త)(Divya Dutta) పార్టి లో చేరి ఏం యల్ ఏ గా గెలవలనుకుంటారు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఇద్దరూ ఏం యల్ ఏ లు గెలిచి మంత్రి పదవుల తో అలరిస్తారు. ఈ క్రమంలో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్న రాయపాటి చక్రధర్ రావు అలియాస్ ఆర్‌సీఆర్ (సాయికుమార్)(Sai Kumar) తన సినీ జీవితానికి స్వస్తి చెప్పి వీర తెలుగు పార్టీని స్థాపిస్తాడు.
తదనంతర పరిస్థితుల్లో కృష్ణమ నాయుడు ఆర్‌సీఆర్ కుమార్తె వైష్ణవి(భావన)(Bhavana) ను వివాహం చేసుకుంటాడు. దాంతో మామ గారి పార్టీ తరపున వ్యతిరేకంగా పోరాడవలసి వస్తుంది. రామిరెడ్డి పార్టి సిద్దాంతాల పరంగా బద్ద శత్రువులుగా మారిపోతారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కృష్ణమనాయుడు రాజకీయాలపై ఎందుకు ఆసక్తి పెంచుకొన్నాడు? ఫ్యాక్షన్ కుటుంబ నుంచి వచ్చిన రామిరెడ్డి తన తండ్రి ఫ్యాక్షన్ వ్యవహారాలను ఎందుకు వ్యతిరేకించాడు? కృష్ణమ నాయుడు లవ్ అఫైర్ ఎలా బ్రేక్ అయింది? పెద్దల్ని ఎదురించి తాను ప్రేమించిన మరదలిని రామిరెడ్డి ఎలా పెళ్లి చేసుకొన్నాడు? కృష్ణమ నాయుడు, రామిరెడ్డి ఎలా స్నేహితులయ్యారు. దేశంలో ఎమర్జెన్సీ పెట్టి.. బలవంతంగా వేసక్టమి ఆపరేషన్లను చేయించాలని ఐరావతి బసు ఎందుకు నిర్ణయం తీసుకొన్నది. ప్రధాని ఐరావతి బసు నిర్ణయం కేకేఎన్, ఎంఎస్ఆర్‌ను ఎలా దగ్గరికి చేర్చింది. వైద్య వృత్తిని వదిలి రామిరెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? సినీ నటుడు, మామ రాయపాటి చక్రధర్ రావు పార్టీ పెట్టిన తర్వాత కేకేఎన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయి? తన స్నేహితుడు కేకేఎన్కు రామిరెడ్డి సహకరించాడా? కేకేఎన్, రామిరెడ్డి శత్రువులుగా ఎలా మారారు? అనే ప్రశ్నలకు సమాధానమే మయసభ 9 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ కథ.
నటీనటుల హవబావలు :
హీరో, విలన్, క్యారెక్టర్ ఎలాంటి పాత్రనైనా సులభంగా తన మార్క్ నటనతో మెప్పించగల నటుడు ఆది పినిశెట్టి.. కృష్ణమ నాయుడు పాత్రలో తన ఫెర్ఫార్మెన్స్‌తో మరోసారి విశ్వరూపం చూపించాడు. కీలక సన్నివేశాల్లో చూపించిన హావభావాలు, పాత్రకు సరిపడే యాటిట్యూడ్‌ను చక్కగా చూపించాడు. తనకు పోటీగా నటించిన రామిరెడ్డి క్యారెక్టర్‌ను రెచ్చగొట్టి చైతన్య నుంచి సూపర్ పెర్ఫార్మెన్స్‌ను రాబట్టడంలో తన వంతు సహకారం అందించాడు. ఈ వెబ్ సిరీస్‌లో అద్బుతమైన పెర్పార్మెన్స్‌తో చైతన్య రావు సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా కనిపిస్తాడు. ఎవరూ ఊహించని విధంగా పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ఆర్‌సీఆర్ పాత్రలో సాయికుమార్ చెలరేగిపోయి నటించాడు. మరో కీలక పాత్రలో రవీంద్ర విజయ్ నటన బాగుంది. మిగితా పాత్రల్లో నటించిన వారంత ఈ వెబ్ సిరీస్‌లో మణిహారంలో ముత్యాల మదిరిగా ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే.. ఇంత పెద్ద సిరీస్ చేస్తున్నపుడు మ్యూజిక్ కీలకం. అందులో ఫిదా ఫేమ్ శక్తికాంత్ కార్తిక్ చాలా బాగా తన పాత్ర పోషించాడు. శక్తికాంత్ కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు సిరీస్‌కు బ్యాక్ బోన్‌గా నిలిచాయి. ఎడిటర్ ప్రవీణ్ కూడా షార్ప్ కట్స్‌తో రక్తి కట్టించాడు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. సురేష్ రగుతు చిత్రీకరించిన సన్నివేశాలు చాలా రిచ్‌గా కనిపించాయి. రూరల్, అర్బన్ డ్రామాను మిక్స్ చేసి తెర మీద చూపించిన విధానం హైలెట్‌గా నిలిచింది. ప్రవీణ్ కేఎల్ ఎడిట్ చేసిన తీరు చూస్తే.. అనేక సవాళ్లను అధిగమించి ఉంటారనిపించింది. ఇక దర్శకుడు విషయానికొస్తే… ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దేవా కట్ట. సినిమాలు ఫాలో అయ్యే వాళ్లకు ఈయన గురించి చెప్పనక్కర్లేదు. దేవా కట్టా అనే పేరు చూసి సినిమాకు వెళ్లే వాళ్లు కూడా లేకపోలేదు. తక్కువ సినిమాలే చేసినా కానీ వచ్చిన గుర్తింపు మాత్రం ఎక్కువే. ప్రస్థానంతో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలకు ఈయన కేరాఫ్‌గా మారిపోయాడు. ఈరోజుకు కూడా తెలుగులో బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఏది అంటే మరొక ఆలోచన లేకుండా ప్రస్థానం అంటారు.
దేవ కట్ట ఆలోచన శైలి ఎలా ఉందో ఈ సినిమా చూస్తే అర్థమయిపోతుంది. అంత అద్భుతమైన సినిమా తీసిన ఈయన.. ముందే చెప్పాను కదా వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనలు తన సిరీస్‌లో రాసుకున్నా అని అంటున్నాడు ఈ దర్శకుడు. విజయవాడ కుల రాజకీయం.. రాయలసీమ ఫ్యాక్షనిజం.. చంద్రబాబు నాయుడు ఫ్లాష్ బ్యాక్.. ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీ క్యారెక్టర్స్.. ఎమర్జెన్సీ సమయంలో సంజయ్ గాంధీ అమలుపరచిన కుటుంబ నియంత్రణ.. సీమలో రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి చేసిన ఫ్యాక్షనిజం.. ఇలా ఒక్కటేంటి సిరీస్ నిండా ఎన్నో సంఘటనలు గుర్తు చేసేలా ఉన్నాయి. అవన్నీ కేవలం కల్పితాలు అని దేవా కట్ట చెప్పినంత మాత్రాన నమ్మలేం.. అలాగని నేను అన్ని అబద్ధాలే చెప్పానని కూడా చెప్పట్లేదు దేవా కట్టా. మీరు కనెక్ట్ అయితే నా తప్పు కాదంటున్నాడు. 6వ ఎపిసోడ్ నుంచి స్పీడ్ పెరుగుతుంది. అక్కడ్నుంచి రెడ్డి, నాయుడు రాజకీయంగా ఎదుగుతుండటంతో స్క్రీన్ ప్లే కూడా ఫాస్టుగానే వెళ్లిపోయింది.
8వ ఎపిసోడ్‌లో కథనం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. నక్సలిజాన్ని కూడా ఇందులో చాలా బాగా చూపించాడు. చివరి ఎపిసోడ్ అంతా చాలా వేగంగా వెళ్లిపోతుంది. సెకండ్ సీజన్ లీడ్ కూడా చాలా బాగా ఇచ్చాడు దేవా కట్టా. రైటింగ్, డైరెక్షన్ పరంగా అద్భుతమైన పనితీరు కనబరిచిన దేవాకట్టా – కిరణ్ జయ్ కుమార్ ద్వయానికి టెక్నికల్ టీమ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. టీం చేత అటువంటి అవుట్ పుట్ రాబట్టుకున్నారు. క్యాస్టింగ్ పరంగా మంచి మార్కులు స్కోర్ చేస్తుందీ సిరీస్. ఆ తర్వాత కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ టీమ్ ఉంటుంది. ఆ కాలాన్ని తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. అయితే, కొన్ని షాట్స్ వీఎఫ్ఎక్స్ బాలేదు. తలలు నరికే సన్నివేశాల్లో జాగ్రత్త వహించాల్సింది. ఇంద్ర కీలాద్రిని చూపించే సీన్ బావుంది. కాస్ట్యూమ్స్ కూడా ఓకే. విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీ హర్ష అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాను పూర్తి స్థాయిలో హై స్టాండర్డ్‌లో నిర్మించారు.
విశ్లేషణ :
మాయసభ అనగానే మహాభారతం లో రాజసుయయాగంనికీ కౌరవ అగ్రజుడైన సుయోధన చక్రవర్తి కి జరిగిన పరాభవ ప్రదేశం మాయసభ గుర్తుకొస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పాలిటిక్స్, ఆయా రాజకీయ నేతల జీవితాల్లోని అంతర్గత అంశాలు, కుట్రలు, కుతంత్రాలు, ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రాంతీయంగా ఆధిపత్య పోరాటం, అధికార దాహం, సామాజిక అంశాలు ఎన్నో కలబోసి రూపొందిన వెబ్ సిరీస్ మయసభ. ఈ వెబ్ సిరీస్ చూస్తే 60 చరిత్రను ఓ గ్రంథంగా మలిచి అంధించినట్టు అనిపిస్తుంది. హిస్టరీకి ఎన్నో సాక్ష్యాలకు రూపంగా నిలుస్తుంది. పిరియాడిక్ మూడ్ కొత్త అనుభూతిని పంచుతుంది. దర్శక రచయితలు దేవా కట్టా – కిరణ్ జయ్ కుమార్ తమది ఫిక్షనల్ కథ అని ఎంత బల్లగుద్ది చెప్పినా సరే… ‘మయసభ’ చూస్తున్నంత సేపూ వైయస్సార్ – చంద్రబాబు కళ్ళ ముందు మెదులుతారు. వాళ్లిద్దరూ మాత్రమే కాదు… ఎన్టీఆర్, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, వంగవీటి రంగా, పరిటాల రవి, నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు గుర్తొస్తారు. ఎవర్నీ ఎక్కువ చేయలేదు, ఎవర్నీ తక్కువ చేయలేదు – సిరీస్ ప్రారంభం నుంచి ముగింపు వరకు త్రాసులో ఎవరి వైపు మక్కువ చూపించకుండా, ఎవరి కోసమో తలొగ్గకుండా ‘వాట్ నెక్స్ట్?’ అనేలా ఉత్కంఠ పెంచుతూ ‘మయసభ’ తీశారు. ఓ రెండు తరాల ముందు ప్రజలకు అప్పటి రాజకీయ పరిస్థితులు – మలుపుల మీద అవగాహన ఉంటుంది. అయితే… వాళ్ళు సైతం ఆశ్చర్యానికి గురయ్యేలా ‘మయసభ’ కథ, కథనం, సన్నివేశాలు నడిపించారు దేవాకట్టా – కిరణ్ జయ్ కుమార్.
వైయస్సార్ – చంద్రబాబు మధ్య స్నేహం ఎలా మొదలైంది? అనే అంశం నుంచి శత్రువులుగా ఎలా మారారు? అనేది ‘మయసభ’ మొదటి సీజన్ కథాంశం. కులం మీద తన అభిప్రాయాలు వెల్లడించడంలో దేవాకట్టా అసలు మొహమాట పడింది లేదు. ‘ఈ దేశంలో పుట్టిన ప్రతివాడి వెనుక ఒక బలం ఉంటుంది… కులం. ఏ ఎన్నికల్లో గెలవాలన్నా ఆ బలం నీ వెనుక ఉండాలి’ అని రామిరెడ్డికి తండ్రి బాంబుల శివారెడ్డి చెప్పడం నుంచి మొదలు పెడితే… ‘యేసును నమ్ముకున్నంత మాత్రానా నేను రెడ్డిని కాకుండా పోతానా’ అని రామిరెడ్డి చెప్పడం, తన కులం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉంటానని అనడం వరకు పలు సన్నివేశాల్లో కులం మీద కలం జూలు విదిల్చారు దేవాకట్టా. ”ఈ కుల వివక్షలో ఏదో ఒక జెండా అండ లేకుండా బతకడం కష్టం బ్రదర్! మా ఏరియాలో ఏకంగా ఆ ఎర్ర జెండాను కూడా కబ్జా సేశారు!” అని వాకాడ మహేష్ (వంగవీటి రంగా?) చెప్పే మాట అయితే పీక్స్. అయితే ఇటు టీడీపీ, అటు వైసీపీ నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడ్డారు. సేఫ్ గేమ్ ఆడారు. పాత్రల నేపథ్యంలో మార్పులు చేయడం వల్ల ఈ క్యారెక్టర్ వీళ్లదేనని చెప్పడానికి లేకుండా పోయింది.
రాజకీయ పరంగా లిబర్టీ తీసుకోవడం వల్ల అప్పటి పరిస్థితులపై అవగాహన ఉన్న జనాలకు తప్పొప్పులు కనబడతాయి. దర్శకుడిగా దేవా కట్టా మార్క్ అయితే చాలా సన్నివేశాల్లో కనిపించింది. వ్యూహాలు అమలు చేయడంలో కృష్ణమ నాయుడు దిట్ట అని చూపిస్తే… రాజకీయం కోసం రామిరెడ్డి కులం అండ కోరుకున్నట్టు సన్నివేశాలు సాగాయి. కృష్ణమ నాయుడు , రామిరెడ్డి పాత్రలను పరిచయం చేయడం నుంచి వాళ్ళ మధ్య స్నేహం చిగురించడం, రాజకీయాల్లోకి రావడం వరకు కథనం ఆసక్తిగా సాగుతుంది. అయితే మధ్యలో వచ్చే ఒక హాస్పిటల్ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. కృష్ణమ నాయుడు కాలేజీ ప్రేమ కథ ఓ పార్టీ జనాలకు నచ్చకపోవచ్చు. తమ అధినేతను అలా చూడటం వాళ్లకు ఇబ్బంది. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసే ఎపిసోడ్స్, ఐరావతి బసు ఎమర్జెన్సీ ఎపిసోడ్ – ఏపీ సీఎం మార్చడం వంటివి బావున్నప్పటికీ… తెలిసిన కథగా అనిపిస్తుంది. అయితే రాయపాటి చక్రధర్ రావు ఎంట్రీతో కథలో వేగం పెరిగింది. సన్నివేశాల్లో మరింత ఆసక్తి మొదలైంది. ఆయన సీఎం కావడం వరకు చూపించడంతో చివరకు ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా సీజన్ 1 ముగిసింది. అయితే… అందరూ ఆశించిన ఆశ్రమ్ హోటల్ ఎపిసోడ్ నుంచి మామ అల్లుళ్ళ మధ్య పోరు కోసం సీజన్ 2 రిలీజ్ కోసం వెయిట్ చేయాలి.
“మయసభ” లోని డైలాగులు తుటాల్లాగా కనెక్ట్ అవుతున్నాయి వాటిలో కొన్ని….
* ఫ్రెండ్ గా ఒక మాట చెప్పనా నాయుడు… యుద్ధం నీ ధర్మం
* వ్యవసాయాన్ని మించిన చదువు లేదు పెద్దయ్య…
మా అందరికన్నా పెద్ద చదువు నీదే.
* డబ్బులతో కొనలేనిది ఒకటే ఒకటి ఉంది… ప్రజల మనసు.
* మడక దున్నే కులంలో పుట్టిన వాడికి నీకెందుకు అబ్బే రాజకీయం.
* వసూలు చేసే కులం లో పుట్టిన రౌడీ వి నీకెందుకయ్యా వైద్యం.
* ప్రతిపక్ష నాయకుడికి ఎందుకు ఫోన్ చేసినావ్.
ఫ్రెండ్ గానా.. ప్రత్యర్థి గానా?
* ఏం జరుగుతుంది నాయుడు?
కురుక్షేత్రం.
* ఇది చావో రేవో అర్ధం కావడం లేదు రెడ్డి…
20 ఏళ్ల రాజకీయ జీవితం ఒక మేకప్ ఆర్టిస్ట్ చెప్పు కింద నలిగిపోతుంది అనుకోలేదు.
* స్నేహితుడి గా ఒక మాట చెప్పు. ఈ ఉచ్చు నుంచి బయటపడతానంటావా?
* ఈరోజు నువ్వు గెలిస్తే…
ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే బాణం గా మారుతుంది.
ఆ బాణం నిన్ను ఓడించేంత వరకు వాడుతూనే ఉంటాను.
* చివరికి పిల్లనిచ్చిన మామ తోనే ఉనికి కోసం పోరాడుతున్నాను.
I must go all the way.
వేరే దారి లేదు.