Coolie Review: డీలా పడిన ‘కూలీ’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : సన్ పిక్చర్స్
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్,
అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్, పూజా హెగ్డే తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్, నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
విడుదల తేది : 14.08.2025
నిడివి : 2 ఘంటల 50 నిముషాలు
సినిమా స్టైల్ అనే మాటకు నిర్వచనం, మన కళ్ల ముందు కనిపించే రూపం సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). సిల్వర్ స్క్రీన్‌పై రజినీ కనిపిస్తే వచ్చే ఊపు.. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవల్. తలైవా నడిచినా, చూపు చూసినా, నవ్వినా, అంతెందుకు జుట్టు సరిచేసుకున్నా, సిగరెట్ తాగినా.. ఆఖరికి సిగరెట్ తాగినా… అందులో కూడా ఒక స్టైల్ ఉంటుంది..50 ఏళ్లుగా రజినీ ప్రేక్షకులని ఏమాత్రం బోర్ కొట్టకుండా సినిమాలు చేస్తూనే వుంటున్నారు రజిని… అలాంటి రజినీ స్టైల్‌ని కూలీ చిత్రంలో చూడొచ్చని మూవీ టీమ్ బలంగా ప్రమోషన్స్ చేసింది. రజినీ కెరీర్‌లో కూలీ ఓ మైలురాయిలా నిలిచిపోతుందని ఫ్యాన్స్ కూడా బలంగా నమ్మారు. మరి లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ చిత్రం అంచనాల్ని అందుకుందా? కింగ్ నాగార్జున విలన్ పాత్రలో ఎలా కనిపించారు? ఆమిర్ ఖాన్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్ ఎలా ఉన్నాయి..ఈ రోజు థియేటర్ లలో విడుదలైన కూలీ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ :
సైమన్ ( నాగార్జున అక్కినేని) పోర్టులో అక్రమ దందాలు నిర్వహిస్తుంటాడు. ఈ మొత్తం సామ్రాజ్యాన్ని సైమన్ వద్ద పని చేస్తున్న దయాళ్ (సౌబిన్ షాహిర్) చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ గోల్డ్ స్మగ్లింగ్ కాకుండా అంతకుమించి ఏదో జరుగుతుందని పోలీసులకి అనుమానం వస్తుంది. సైమన్ చేసే అక్రమ వ్యాపారాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. అప్పుడప్పుడు కొంతమంది పోలీసులని ఈ పోర్టులోకి కూలీలుగా పంపిస్తూ ఉంటుంది డిపార్ట్‌మెంట్. అలాంటి వారిని గుర్తించి చంపేయడం దయాల్ పనిగా పెట్టుకొంటాడు. అయితే రాజశేఖర్ (సత్యరాజ్)ను దయాల్ చంపేస్తాడు. అయితే తన స్నేహితుడు రాజశేఖర్ మరణిస్తే..చివరి చూపు కోసం దేవా (రజనీకాంత్) వెళ్తే అతడి కూతురు ప్రీతీ (శృతిహాసన్) అడ్డుకొంటుంది. అయితే రాజశేఖర్ మరణం తర్వాత ప్రీతీతో ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకొన్న దేవా వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. సైమన్ చేసే అక్రమ వ్యాపారాలు ఏంటి? సైమన్ కంపెనీలో పనిచేసే సిబ్బందిని చంపేసి ఆనవాళ్లు లేకుండా వాళ్ళను కాల్చివేస్తుంటారు? సైమన్ బిజినెస్‌పై పోలీసులు ఎందుకు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు? రాజశేఖర్‌ను దయాల్ ఎందుకు చంపాడు? దయాల్ చంపేసే సమయంలో రాజశేఖర్ చెప్పిన మాట ఏమిటి? అసలు రాజశేఖర్, దేవాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తన స్నేహితుడి కోసం దేవా దేనికైనా తెగించేందుకు సిద్దపడ్డారు. ఆపదలో ఉన్నప్పుడు ఓ ఫోన్ నెంబర్ కాల్ చేసి రాజశేఖర్ కూలీ నంబర్ ఎందుకు చెప్పమన్నాడు? ఆ కూలీ నంబర్ ఎవరిది? సైమన్‌కు దేవాకు ఉన్న వైరం ఏమిటి? ఇంతకీ దాహా (ఆమిర్ ఖాన్), ఖలీషా (ఉపేంద్ర) ఎవరు? దేవా అసలు జీవితం ఏమిటి? సైమన్‌కు దేవా ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే కూలీ సినిమా కథ.
నటీనటుల హవబవాలు :
ఇక నటినటులు ఎవరెలా చేశారనే విషయానికొస్తే రజినీ స్టైల్, యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా దేనికీ పేరు పెట్టే పనిలేదు. లోకేష్ ఏం చెప్పారో అది తలైవా తనదైన స్టయిల్లో చేసుకుంటూ వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రజినీని చూసి విజిల్స్ వేయడం మాత్రం ఫ్యాన్స్ మర్చిపోరు. ఇక ఫస్ట్ టైమ్ విలన్‌గా తెరపై కనిపించిన నాగార్జున తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. తన లుక్, స్టైల్ అన్నీ చాలా బావున్నాయి. బ్యాడ్ బాయ్‌గా నాగ్ బాగా సూట్ అయ్యారు. కానీ ఈ పాత్రలోనే అంత బలం లేదు. మరోవైపు సౌబిన్ షాహిర్ మాత్రం ఇరగదీశాడు. దయాళ్ పాత్రలో సౌబిన్ చూపించిన వెర్రితనం, కామెడీ, డ్యాన్స్, యాక్షన్ ఇలా అన్నీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ పాత్రని బాగా డీల్ చేశాడు సౌబిన్. ఇక ఆమిర్, ఉపేంద్ర గెస్టు రోల్స్‌కి ఒప్పుకున్నా కూడా వాళ్ల లెవల్‌కి తగ్గ పాత్రలు మాత్రం కాదు. ముఖ్యంగా ఉపేంద్ర విషయంలో లోకేష్ వేరే ఏమైనా ఆలోచించి ఉంటే బావుండేది. ఇక సత్యరాజ్ తన పాత్రలో ఒదిగిపోయారు. శ్రుతి హాసన్‌కి ఫుల్ లెంగ్త్ రోల్‌యే దొరికింది కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం సూట్ కాలేదు. శ్రుతి హాసన్ ఓన్ డబ్బింగ్ చెప్పారు. అయితే సినిమాలో కళ్యాణిగా కనిపించిన రచిత రామ్ పాత్ర మాత్రం ఆడియన్స్‌ని కాస్త సర్‌ప్రైజ్ చేస్తుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
కూలీ విషయంలో లోకేష్ మార్క్ మాత్రం మిస్ అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే సెకండాఫ్ చూస్తున్నంతసేపు ఆడియన్స్ మదిలో విక్రమ్, జైలర్, బాషా ఇలా చాలానే సినిమాలు రన్ అవుతూ ఉంటాయి. చాలా సీన్లు అవే టెంప్లెట్‌లో వెళ్తూ ఉంటాయి. ఇది సినిమాకి మైనస్ అయ్యే అంశం అనిపిస్తుంది. కూలీ కథ సెటప్, పాత్రలు, దానికి లోకేష్ ఎంచుకున్న స్టార్ క్యాస్టింగ్ ఇలా అన్నీ చాలా భారీగా ఉన్నాయి. కానీ వాటిని లోకేష్ డీల్ చేసిన విధానం మాత్రం ప్రేక్షకులకి అనుకున్నంత కిక్ ఇవ్వలేకపోయింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా పేలవమైన సీన్ల కూడా తన మ్యూజిక్‌తో హైప్ ఇచ్చాడు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్‌తో కేక పెట్టించేలా ఉంది. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, యాక్షన్ కోరియోగ్రఫి స్పెషల్ ఎట్రాక్షన్. గిరీష్ గంగాధరన్ చిత్రీకరించిన విధానం బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్‌లో ఉన్నాయి.
విశ్లేషణ :
ఈ సారి లోకేష్ కనగరాజ్ టేకింగ్, స్టైల్.. ఆ గ్రిప్పింగ్ స్క్రీన్‌పై మాత్రం కూలీలో మిస్ అయిందని చెప్పొచ్చు. కథ, కథనాలు చాలా బలహీనంగా వున్నాయి.. సినిమా మొత్తం నత్త నడకన సాగడం ఓ దశలో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారుతుంది. కథ, కథనాలపై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. భారీ అంచనాలు పెట్టుకొన్న ఫ్యాన్స్‌ను లోకేష్ నిరాశపరిచాడనే చెప్పాలి. ఎలాంటి అంచనాలు వున్నా.. ప్రేక్షకుడు అసంతృప్తికి గురి కాకుండా ఉండలేడు. రజనీ, సౌబీన్, శృతి ఫెర్ఫార్మెన్స్ కోసం, అనిరుధ్ మ్యూజిక్ ఓ సారి చూడొచ్చు. రజనీ ఎప్పటిలానే తన యాక్టింగ్‌తో అక్కడక్కడ మాయాజాలం చేయడం సినిమా రక్షణగా నిలిచింది. ఓవరాల్‌గా చెప్పాలంటే లోకేష్ కనగరాజ్ టేకింగ్, స్టైల్.. ఆ గ్రిప్పింగ్ స్క్రీన్‌పై మాత్రం కూలీలో మిస్ అయింది. ఏది ఏమైనా రజినీ ఫ్యాన్స్‌కి మాత్రం కూలీ నచ్చుతుంది.