ప్రశాంత్ వర్మ నెక్ట్స్ రిలీజేంటి?
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసింది నాలుగు సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్, బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. మొన్న సంక్రాంతికి హను మాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. చిన్న సినిమాగా రిలీజైన హను మాన్ ఓ రేంజ్ లో నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలను మిగిల్చింది.
ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమాను కూడా మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట రోజే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా మొదలు పెట్టారు. దీంతో జై హనుమాన్ వచ్చే ఏడాది కచ్ఛితంగా రిలీజవుతుందని అందరూ అనుకున్నారు. సీక్వెల్ లో హనుమంతుడిదే మెయిన్ రోల్ అని, ఆ రోల్ లో ఓ స్టార్ హీరో నటించనున్నాడని ఇప్పటికే ప్రశాంత్ వర్మ పలుసార్లు చెప్పాడు.
అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ తను నెక్ట్స్ రిలీజ్ చేయబోయే సినిమా విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా జై హనుమాన్ లో మెయిన్ రోల్ కోసం ఎవరినీ సెలెక్ట్ చేయకపోవడంతో ఆ సినిమాకు టైమ్ పడుతుందని ప్రస్తుతం తన దృష్టిని ఆక్టోపస్ వైపు మళ్లించాడట. ఈ సినిమా కోసం ప్రశాంత్ వర్మ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తోంది.
ఇప్పటికే దాదాపు 65% షూటింగ్ పూర్తి చేసుకున్న ఆక్టోపస్ సినిమాను 2024లో రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నాడట. ఇది కాకుండా కొన్నాళ్ల క్రితం మరో సూపర్ హీరో మూవీని కూడా ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తూ అధీర అనే సినిమాను అనౌన్స్ చేస్తూ 2024లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఒకవైపు జై హనుమాన్, మరోవైపు అధీర, ఇంకోవైపు ఆక్టోపస్.. వీటిలో ఏ సినిమాను ప్రశాంత్ వర్మ ముందుగా రిలీజ్ చేస్తాడో చూడాలి.













