ViKram: ఆ డైరెక్టర్ కు విక్రమ్ ఓకే చెప్పాడా?

కోలీవుడ్ స్టార్ విక్రమ్(Vikram) సోలోగా సక్సెస్ అందుకుని చాలా కాలమే అయింది. రీసెంట్ గా వీర ధీర శూరన్2(Veera Dheera Sooran2) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన విక్రమ్ ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఈ సినిమాతో విక్రమ్ కం బ్యాక్ ఇస్తాడనుకుంటే ఆ సినిమా కూడా అతని ఆశలపై నీళ్లనే చల్లింది. వీర ధీర శూరన్2 తర్వాత విక్రమ్ తన 63వ సినిమాను మడోన్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే విక్రమ్ కు ఓ టాలెంటెడ్ డైరెక్టర్ కథ చెప్పాడని కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అతను మరెవరో కాదు, ప్రేమ్ కుమార్(Prem Kumar). విజయ్ సేతుపతితో 96 సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న ప్రేమ్, గతేడాది సత్యం సుందరం(Satyam Sundaram) సినిమాతో మరో మంచి హిట్ ను అందుకున్నాడు. సత్యం సుందరం సినిమా వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ ప్రేమ్ తన తర్వాతి సినిమాను అనౌన్స్ చేసింది లేదు.
ఈ నేపథ్యంలో ప్రేమ్, తన తర్వాతి సినిమాను విక్రమ్ తో చేయాలనే ఆలోచనతో అతనికి ఓ కథ చెప్పాడట. తాజా సమాచారం ప్రకారం ప్రేమ్ చెప్పిన కథకు విక్రమ్ తలూపాడని, ఈ సినిమా కూడా ప్రేమ్ గత సినిమాల మాదిరిగా స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రేమ్ కుమార్ ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడని, అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా జూన్ నుంచి మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.