విజయ్ దేవరకొండ ప్లానింగ్‌తో ప్రశ్నార్థకంగా మారిన శివ నిర్వాణ సినిమా?
సినిమా ఇండస్ట్రీ అంటేనే చిత్ర విచిత్రాల మయం. హిట్ అవుతుందనుకొని ప్రాణం పెట్టి చేసిన సినిమా డిజాస్టర్ అవుతుంది. ఆడుతూ పాడుతూ జాలీగా చేసిన సినిమాలు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలు సూపర్‌హిట్ అవుతుంటాయి. అలాగే కాంబినేషన్స్ విషయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా వచ్చిందంటే దాని వెనుక ఎంతో కసరత్తు ఉంటుంది. కొన్ని కాంబినేషన్స్ కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూసినా సెట్ కావు. కొన్ని మాత్రం సడన్‌గా కుదిరిపోతాయి. అలాంటి ఓ విచిత్రం ఇప్పుడు టాలీవుడ్లో చోటు చేసుకుంది. గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ చేసిన నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో విజయ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి టైటిల్ ఫైటర్ అని, లైగర్ అని రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించే సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తాడని ఆమధ్య ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే సడన్‌గా విజయ్ తన రూటు మార్చి సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్టు ఎనౌన్స్ చేశాడు విజయ్. అయితే సడన్‌గా విజయ్ బాలీవుడ్లో ఓ స్ట్రయిట్ సినిమా చేయబోతున్నాడని, దేశభక్తుడు అభినవ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్ సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. మరి శివ నిర్వాణ కాంబినేషన్లో సినిమాను ఈ బయోపిక్ తర్వాత చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు.
కానీ, దానికి విరుద్ధంగా మరో సినిమా తెరపైకి వచ్చింది. అది సుకుమార్ సినిమా. ఇప్పటివరకు ఈ కాంబినేషన్ గురించి ఎక్కడా వినిపించలేదు. ఒక్కసారిగా ఈ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చేసరికి శివనిర్వాణ సినిమా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఫైటర్ తర్వాత అభినవ్ బయోపిక్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తారట. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని బట్టి చూస్తే శివనిర్వాణ, దిల్‌రాజు కాంబినేషన్లో సినిమాను అటకెక్కించినట్టేనని సినీ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.













