వెంకీ ఆ రీమేక్ ను వదులుకుని మంచి పనే చేశాడు
ఏ ఇండస్ట్రీలోనైనా సరే రీమేక్స్ రిస్క్ అనే చెప్పుకోవాలి. ఒరిజినల్ ఫలితాలే రిపీట్ అవుతాయన్న గ్యారెంటీ లేదు. ఒక్కోసారి మాత్రమే ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ అవుతాయి. అయితే విక్టరీ వెంకటేష్ కు ఈ రీమేక్ ల విషయంలో సక్సెస్ ఎక్కువనే చెప్పాలి. చంటి, సూర్యవంశం, రాజా, వసంతం, ఘర్షణ లాంటివన్నీ రీమేకులే అయినా మామూలు హిట్లు కాదు.
అంతే కాదు లేట్ వయసులో కూడా దృశ్యం, నారప్ప లాంటి సినిమాలు చేసి హిట్లు అందుకున్నాడు. అయితే లక్కీగా వెంకీ మన ఆడియన్స్ టేస్ట్ కి పెద్దగా సూటవ్వదనుకుని ఓ బాలీవుడ్ మూవీని వదులుకున్నాడంటే ఆశ్చర్యపోక తప్పదు. 2019లో అజయ్ దేవగణ్ హీరోగా దే దే ప్యార్ దే సినిమా వచ్చింది. టబు భార్య, రకుల్ లవర్ గా చేశారు. వయసొచ్చిన పిల్లలున్న మనిషి భార్య ఉండగానే ఓ యువతి ప్రేమలో పడతాడు. దీంతో వాళ్ల జీవితంలో వచ్చే మార్పులు, సరదాగా సాగుతూ ఆ తర్వాత ఎమోషనల్ టర్న్ తీసుకుని హ్యాపీ ఎండింగ్ తో సినిమా ముగుస్తుంది.
ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ తో తీయాలని సురేష్ బాబు రైట్స్ కూడా కొన్నాడు. రామబాణం డైరెక్టర్ శ్రీవాస్ దర్శకుడిగా, రచయిత గోపీ మోహన్ తో స్క్రిప్ట్ వర్క్ చేయించి ఆర్టిస్ట్ లకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. ఈలోగా ధనుష్ అసురన్ చూసిన వెంకీకి దానిపై మనసు మళ్లడంతో ఈ సినిమాను పక్కకు పెట్టి నారప్పను లైన్ లో పెట్టారు.
దీంతో శ్రీవాస్ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. ఈ లోపు కరోనా రావడం, పరిస్థితులు మారడంతో పూర్తి చేసిన స్క్రిప్ట్ వృధాగా మిగిలింది. ఒరిజినల్ సినిమాను చాలా మంది ఓటీటీలో చూడటంతో వెంకీ కూడా ఆ స్క్రిప్ట్ ను లైట్ తీసుకున్నాడు. అయినా వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో అలాంటి భార్యను వదిలేసే పాత్రలు చేస్తే మన ప్రేక్షకులు దాన్ని అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేరు. ఈ మధ్య రానా నాయుడు ఫలితంతో అది వెంకీకి బాగా అర్థమై ఉంటుంది కూడా. ఏదైనా సరే ఆ రీమేక్ ను వెంకీ వదులుకోవడం మంచిదే అయింది.













