ఇటలీలో వరుణ్, లావణ్యల వెడ్డింగ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రేయసి లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే వీరి ఎంగేజ్మెంట్ అత్యంత వైభవంగా జరిగింది. ఇరు ఫ్యామిలీ పెద్దలు, సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటూ సన్నిహితులు కూడా ఈ ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.
గత నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ యువ జంట పెళ్లి తేదీ గురించి ఇప్పటి వరకు ఇద్దరి ఫ్యామిలీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం పెళ్లి తేదీ ఇదేనంటూ, పెళ్లి జరిగేది పలానా దగ్గర అంటూ వార్తలొస్తున్నాయి. వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో డెస్టినేషన్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది.
ఎంగేజ్మెంట్ లాగే పెళ్లి కూడా ఇరు కుటుంబ సభ్యులు, ఆప్తుల మధ్యనే ఇటలీలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్లో ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు, మీడియా వారికి భారీగా రిసెప్షన్ ఏర్పాటు చేయనుందట మెగా ఫ్యామిలీ. కాగా మిస్టర్ సినిమా నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేయగా, పెళ్లి తర్వాత కూడా కలిసి నటించాలని సినీ లవర్స్ కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారుతో గాండీవధారి అర్జున సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఆ తర్వాతి సినిమాను పలాస డైరెక్టర్ కరుణ కుమార్ తో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఓ కీలక పాత్రలో మెరవనుంది.













