ఊల్లాల.. ఊల్లాల ఆడియో ఆవిష్కరణ
నటరాజ్, నూరిన్, అంకిత నాయకానాయికలుగా సత్యప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఊల్లాల ఊల్లాల. గురురాజ్ నిర్మాత. ఈ చిత్ర ఆడియోను దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. మేకింగ్ వీడియో చూస్తుంటే సత్యప్రకాష్లో ఇంతటి ప్రతిభ ఉందా అనిపించింది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. జనవరి 1న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా ద్వారా మా అబ్బాయిని కథానాయకుడిగా పరిచయం చేస్తున్నా. కథానుగుణంగా మంచి టైటిల్ కుదిరింది. నిర్మాత గురురాజ్, నేను ప్రతి సన్నివేశాన్ని చర్చించుకొని సినిమాను తెరకెక్కించాం. టైటిల్‌కు మంచి స్పందన వస్తున్నది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ అలరించే అంశాలున్న చిత్రమిది అని దర్శకుడు తెలిపారు. సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఈ వేడుకకు రామ్‌గోపాల్ వర్మ రావడం మంచి ఎనర్జీనిచ్చిందని సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో భాగం కావడం ఆనందంగా ఉందని నాయకనాయికలు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.













