మరో క్రేజీ ప్రాజెక్టు కొట్టేసిన త్రిష
సౌత్ క్వీన్ త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 20 ఏళ్లు దాటుతోంది. మామూలుగా హీరోయిన్లు పదేళ్లు స్టార్ హీరోయిన్ గా ఉండటమే ఎక్కువ. అలాంటిది త్రిష రెండు దశాబ్ధాలుగా తన హవా కొనసాగిస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా త్రిష స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ఇప్పటికే నాలుగు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్న త్రిషకు స్టార్ హీరో నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కినట్లు సమాచారం.
ప్రస్తుతం త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభర సినిమా చేస్తుంది. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మగిజ్ తిరుమేని, అజిత్ కాంబోలో తెరకెక్కుతున్న విదాముయార్చిలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ కానుంది.
వీటితో పాటూ మలయాళంలో మోహన్ లాల్ సరసన రామ్ అనే సినిమాలో, తమిళంలో మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో రూపొందుతున్న థగ్ లైప్ లోనూ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు కొత్తగా త్రిష అజిత్ సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. ఏదేమైనా ఈ వయసులో త్రిష నవతరం హీరోయిన్లకు పోటీ ఇస్తూ బిజీగా ఉండటాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.













