వెల వెల బోతున్న తెలుగు వెబ్ సిరీస్‌లు… ఓటీటీ పోటీలో నిలవలేకపోతున్న టాలీవుడ్
దేశవ్యాప్తంగా థియేటర్లు మూతబడ్డ కారణంగా ఇప్పుడు దేశ ప్రజలంతా టీవీలకే అంకితమైపోయారు. వారికి కావాల్సిన అన్నిరకాల ఎంటర్‌టైన్‌మెంట్‌నూ బుల్లితెరపైనే చూసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని దర్శకనిర్మాతలు కొంతమంది తమ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసుకుంటున్నారు. మరికొంతమంది మాత్రం తమ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని ఖచ్చితంగా చెబుతున్నారు. ఇక కొత్త సినిమాలు ప్రారంభమయ్యే సూచనలు ఇప్పట్లో కనిపించకపోవడంతో కొందరు దర్శకనిర్మాతలు ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్‌గా చూస్తున్న వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడుతున్నారు. అయితే సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు వున్న తేడాను మన టాలీవుడ్ ప్రముఖులు గుర్తించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వెబ్ సిరీస్‌లను కూడా రెగ్యులర్ సినిమాల్లాగే తీసి జనంపైకి వదులుతున్నారు. కానీ, ప్రేక్షకులు మాత్రం వెంటనే వాటిని తిప్పి కొడుతున్నారు.
మన తెలుగు సినిమాలు అనగానే హీరో ఎలివేషన్ ఎక్కువగా ఉంటుంది. హీరో పది మందిని చితక్కొట్టి కాలర్ ఎగరేసే సన్నివేశాలు, డైలాగులతో ఊదరగొట్టే సీన్స్ అధికంగా ఉంటాయి. కానీ, వెబ్ సిరీస్‌లలో అలాంటి పప్పులు ఉడకవని తెలుసుకోలేకపోతున్నారు. థియేటర్లో వందల మంది మధ్య కూర్చొని చూసే సినిమాలు వేరు, ఇంట్లో రిలాక్స్డ్గా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలు వేరు. సినిమాటిక్‌గా ఉండకుండా నేచురల్‌గా నడిచే కథ, కథనాలు, పాత్రలతో రూపొందించిన వెబ్ సిరీస్‌లకు ఆదరణ బాగా ఉంటుందని ఉత్తరాది దర్శకనిర్మాతలు ఎప్పుడో గ్రహించారు. అందుకే ఎంతో నేచురల్‌గా ఉండే వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ టాలీవుడ్ కంటే ఎంతో బాలీవుడ్ ముందంజలో ఉంది. ఇప్పటికే వాళ్లు నిర్మించిన ఎన్నో వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి.
ఈమధ్యకాలంలో తెలుగులో వచ్చిన కొన్ని వెబ్‌సిరీస్ ఎంతో నాసిరకంగా ఉంటున్నాయని, ఏమాత్రం ఆసక్తికరంగా ఉండడం లేదన్న విమర్శలు చేస్తున్నారు. థియేటర్‌కి వచ్చే ప్రేక్షకుల పల్స్‌ను తెలుసుకొని సినిమాలు తీసే దర్శకులు వెబ్ సిరీస్ చూసేవారి పల్స్‌ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని, తమ పంథా మార్చుకొని నాణ్యమైన సిరీస్‌లు తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని సినీ పెద్దలు అంటున్నారు. కొత్తగా వెబ్ సిరీస్‌లు చేసే దర్శకనిర్మాతలు ఈ విషయంలో కాస్త రీసెర్చ్ చేసి తీస్తే మనం కూడా వెబ్ సిరీస్‌లు బాగా తియ్యగలమని నిరూపించగలం.













