తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్ ?
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా థియేటర్లు మళ్లీ మూతపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా థియేటర్లు మూసివేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తాత్కాలికంగా సినిమా హాళ్లు మూసివేయాలని ప్రతిపాదనలో కోరింది. ఒకవేళ అది కుదరకపోతే 50 శాతం సీట్లకే అనుమతి ఇవ్వాలని సూచించింది. థియేటర్లలో కరోనా పేరిగే ప్రమాదం ఉందని, అందుకే త్వరలో థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కొత్త సినిమాలు విడుదలైతే 90 శాతం ప్రేక్షకులు థియేటర్లలో ఉంటున్నారని, మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్కనే కూర్చుంటున్నారంది. తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని తెలిపింది. అలాగే జిమ్‌లు, పార్క్‌లపై కూడా నిర్ణయం తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించింది. కాగా సరిగ్గా ఏడాది కిందట మార్చి రెండో వారంలో లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూతపడి డిసెంబరులో మళ్లీ పున:ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.













