Tarakeswari: నవంబర్ 7న‘తారకేశ్వరి’ మూవీ రిలీజ్

తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా రోజుల తర్వాత ఓ సస్పెన్స్ సెంటిమెంటల్ థ్రిల్లర్ రాబోతోంది. శ్రీ శివ సాయి ఫిలిం బ్యానర్‌పై వెంకట్ రెడ్డి నంది స్వీయ దర్శకత్వం లో శ్రీకరణ్, అనూష, షన్ను హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘తారకేశ్వరి’ (Tarakeswari). ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యుల నుండి ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో, చిత్ర యూనిట్ హైదరాబాద్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత వెంకట్ రెడ్డి నంది మాట్లాడుతూ – “నా టీమ్ నాకు అండగా నిలిచింది. అందుకే ఈ తరహా సినిమాలు చేయగలుగుతున్నాను. సినిమా పట్ల అందరి కృషి, ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చింది. అక్టోబర్ 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది. నవంబర్ 7న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుకుంటున్నాం” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము మాట్లాడుతూ – “ఈ సినిమాకి మ్యూజిక్ చాలా చక్కగా కుదిరింది. వెంకట్ రెడ్డి గారి 16 సినిమాల్లో సగానికి పైగా నేను సంగీతం సమకూర్చాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే తృప్తి ఉంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను” అన్నారు.
హీరో శ్రీకరణ్ మాట్లాడుతూ – “ఈ సినిమా ఓ పల్లెటూరిలో జరిగిన యథార్థ గాథ ఆధారంగా తెరకెక్కింది. గ్రామీణ వాతావరణంలో జరిగిన షూటింగ్ మరిచిపోలేని అనుభవం. వెంకట్ రెడ్డి నంది గారు మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. కథ ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. నవంబర్ 7న థియేటర్లలో కలుద్దాం” అన్నారు.
హీరోయిన్ అనూష మాట్లాడుతూ – “సెన్సార్ నుంచి ప్రశంసలు రావడం మా టీంకి గొప్ప ప్రోత్సాహం. సినిమా అందరికీ నచ్చుతుంది, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు కృతజ్ఞతలు” అన్నారు.
విలన్ పాత్రలో నటించిన వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – “నన్ను నమ్మి విలన్ పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది. థియేటర్‌కి వచ్చి తప్పకుండా చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి” అన్నారు.
హీరో తల్లి పాత్రలో నటించిన శ్రీమణి మాట్లాడుతూ – “వెంకట్ రెడ్డి గారు పని విషయంలో చాలా కష్టపడే వ్యక్తి. షూటింగ్‌లో మొదటి నుండి చివరి వరకు ఎంతో శ్రద్ధతో వ్యవహరించారు. ఇలాంటి చిన్న సినిమాలు కూడా కథ బలంగా ఉంటే పెద్ద విజయాలు సాధిస్తాయి. ‘తారకేశ్వరి’ కూడా అలాంటి సినిమా అవుతుంది” అన్నారు.
మరో హీరోయిన్ షన్ను మాట్లాడుతూ – “నేను రెండవ హీరోయిన్‌గా చేశాను. సినిమా నవంబర్ 7న విడుదల అవుతోంది. థియేటర్‌లో చూసి తప్పకుండా ప్రోత్సహించండి” అన్నారు.
రోషి రెడ్డి మాట్లాడుతూ – “ఈ సినిమాలో 300 మంది పని చేశారు. ప్రతి ఒక్కరూ కనీసం ఇద్దరినీ తీసుకెళ్లి థియేటర్‌లో సినిమా చూడమని కోరుతున్నా. సంగీతం అద్భుతంగా వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నా” అన్నారు.
చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడుతూ – “ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. చిన్న సినిమాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం” అన్నారు.
ఈ ప్రెస్ మీట్‌లో ధనుంజయ, బాలస్వామి తదితరులు పాల్గొని చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.