సూర్య ’24’కి సీక్వెల్ చేస్తారా? ప్రీక్వెల్ చేస్తారా?
సూర్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ `24`. 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సూర్య మూడు విభిన్నమైన పాత్రల్ని పోషించారు. అందులో ఒకటి ప్రతినాయకుడి పాత్ర కావడం విశేషం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. తెలుగులో మంచి చిత్రంగా అందరి ప్రశంసలు పొందినప్పటికీ కమర్షియల్‌గా అనుకున్నంత విజయం సాధించలేదు. అయితే తమిళ్లో మాత్రం కమర్షియల్‌గా భారీ విజయాన్ని అందుకుందీ సినిమా. అంతేకాదు సినిమాటోగ్రఫీకి, ప్రొడక్షన్ డిజైన్‌కి రెండు జాతీయ అవార్డులు లభించాయి. ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు సూర్య. ఇవి కాక ఆనంద వికటన్, ఎడిసన్, జీ సినిమా అవార్డులు కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.
సూర్య ఎంతో ప్రాణంగా చేసిన ఈ సినిమా ఇంతటి విజయాన్ని, ప్రశంసల్ని అందించడంతో త్వరలోనే సీక్వెల్‌ని కూడా ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతన్న సమయంలోనే దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేద్దామని డైరెక్టర్ విక్రమ్‌తో సూర్య చెప్పాడట. ఈ సినిమా విడుదలైన నాలుగు సంవత్సరాల తర్వాత సీక్వెల్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దీన్ని సీక్వెల్‌గా చెయ్యబోతున్నారా, ప్రీక్వెల్‌గా చెయ్యబోతున్నారా అనే విషయం బయటికి రాలేదు. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ సూర్యకి వినిపించాడట విక్రమ్. సూర్యకి సబ్జెక్ట్ బాగా నచ్చిందట. కానీ, విక్రమ్‌కి పూర్తి శాటిస్ఫ్యాక్షన్ రాలేదట. అందుకే మళ్లీ సబ్జెక్ట్‌పై వర్కవుట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 24 కంటే స్ట్రాంగ్‌గా ఈ సబ్జక్ట్ ఉండాలని చూస్తున్నాడు విక్రమ్. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.













