రవితేజ సినిమాలో సుధీర్
ప్రయోగాలు చేసే హీరోల్లో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఒకరు. కృష్ణ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుధీర్ బాబు, ఘట్టమనేని సపోర్ట్ తీసుకోకుండా తన టాలెంట్ తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. సినిమా సినిమాకూ కొత్తదనం చూపిస్తూ వస్తున్న సుధీర్, హీరోగానే కాకుండా విలన్ పాత్రల్లోనూ నటించి మెప్పించాడు.
వర్షం మూవీకి రీమేక్ గా బాలీవుడ్ లో వచ్చిన బాగి సినిమాలో విలన్ గా నటించి మంచి మార్కులేసుకున్నాడు సుధీర్. ఇదిలా ఉంటే ఇప్పుడు సుధీర్ బాబు మరో హీరో సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో సుధీర్ బాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో సుధీర్ చేయబోయేది విలన్ పాత్రనా లేక మరేదైనా కీలక పాత్రనా అన్నది తెలియాల్సి ఉంది. ఈ వార్త నిజమైతే మాత్రం మిస్టర్ బచ్చన్ సినిమాకు సుధీర్ క్యారెక్టర్ ఎట్రాక్షన్ గా నిలవడం ఖాయం. మరోవైపు సుధీర్ బాబు ప్రస్తుతం జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వంలో హరోం హర అనే సినిమాలో నటిస్తున్నాడు.













