ఐకాన్ స్టార్ తో దసరా డైరెక్టర్
ఈ సంవత్సరం రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సినిమాల్లో నాని హీరోగా వచ్చిన దసరా సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు పెద్ద సినిమాల రేంజ్లో ఓపెనింగ్స్, హడావుడి కనిపించాయి. దసరా సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమాతోనే తానేంటో ప్రూవ్ చేసుకుని సుకుమార్ శిష్యుడనిపించుకున్నాడు.
తన కేపబిలిటీ ఏంటో, దసరా సినిమాతోనే చూపించిన శ్రీకాంత్, తన తర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో తీయాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ అప్పటికే క్యూలో ఉన్న డైరెక్టర్లకు మెగాస్టార్ ఛాన్స్ ఇవ్వడంతో శ్రీకాంత్‌కు మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు. దీంతో శ్రీకాంత్ కన్ను ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పడింది.
ప్రస్తుతం పుష్ప2 సినిమా చేస్తున్న అల్లు అర్జున్ ఆ తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుంది. ఆ తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయనున్నాడనేది ఇప్పటికైతే కన్ఫర్మ్ కాలేదు.
దీంతో ఆ ఛాన్స్ ను శ్రీకాంత్ చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బన్నీతో శ్రీకాంత్ సంప్రదింపులు జరుపుతున్నాడట. మంచి మాస్ కథతో బన్నీని మెప్పించి, మెగా ఛాన్స్ కొట్టేయాలని చూస్తున్నాడట దసరా డైరెక్టర్. ఇప్పటికే బన్నీకి ఒక లైన్ చెప్పి ఒప్పించాడని, ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పిస్తే బన్నీ, శ్రీకాంత్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు.













