రాజకీయాలపై సోనూసూద్ కీలక ప్రకటన
రాజకీయాలపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ ఎన్నికల్లో తన సోదరి మాళవిక పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మోగాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలు లేవన్నారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మాళవిక ఈ సందర్భంగా చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.
ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్లతో సమావేశం కావడంపై ఆయన స్పందిస్తూ వారిద్దరూ మంచి వ్యక్తులన్నారు. రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను సైతం కలుస్తానని తెలిపారు. ఇటీవల తన నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల గురించి ప్రస్తావించగా, ఇప్పటి వరకు చాలా సమస్యలు ఎదుర్కొన్నానని, కానీ ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పంజాబ్‌లో నిరుద్యోగం అతి పెద్ద సమస్యగా మారిందన్నారు.













