రివ్యూ : మాస్ మషాలా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
బ్యానెర్లు: ఏ కె ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, మరియు జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ ప్రవేట్ లిమిటెడ్.,
నటి నటులు: మహేష్,సూపర్ స్టార్ కృష్ణ,(స్పెషల్) రష్మిక మందన్న, విజయ శాంతి, సూపర్ స్టార్ కృష్ణ, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిశోర్, సత్యదేవ్, అజయ్, సుబ్బా రాజు, నరేష్, రఘు బాబు, సత్యం రాజేష్, బండ్ల గణేష్, సంగీత,హరి తేజ, రోహిణి,పవిత్ర లోకేష్, ప్రత్యేక గీతం లో తమన్నా భాటియా తదితరులు నటించారు.
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ :ఆర్. రత్నవేలు, ఎడిటింగ్ : తమ్మి రాజు
పాటలు :రామ జోగయ్య శాస్ట్రీ, శ్రీ మణి, దేవి శ్రీ ప్రసాద్,
నిర్మాతలు: అనిల్ సుంకర, దిల్ రాజు, జి మహేష్ బాబు
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేదీ :11.01.2020
సంక్రాంతి కానుకగా పండుగ సీజన్‌లో ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడానికి వచ్చిన రెండవ బిగ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్ నటిస్తున్న సినిమా కావడం.. పటాస్ నుంచి ఎఫ్2 వరకు కమర్షియల్ పంథాలో సినిమాలు తీస్తూ హిట్స్ ఇస్తున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడం.. సక్సెసఫుల్ నిర్మాత దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా టీజర్, ట్రైలర్, పాటలు ఆకట్టుకోవడం.. సంక్రాంతి సీజన్‌లో వస్తుండటంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరదాల పండుగ వేళ వస్తున్న ఈ బొమ్మ దద్దరిల్లి అదిరిపోవడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో సరిలేని జోరుతో ఈ బొమ్మ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనిపించుకుందా..సమీక్షలో చూద్దాం.
కథ:
కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతి (విజయశాంతి) చాలా నిక్కచ్చి, నిజాయితీగల డైనమిక్ లేడీ, తప్పును ఎప్పుడూ రైట్ అని టిక్ చేయదు. ఆమె పెద్ద కుమారుడు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం అమరుడవుతాడు. ఆర్మీలో మేజర్ అయిన అజయ్ కృష్ణ (మహేష్ ) పాక్ చేతిలో బంధింపబడిన పిల్లలను కాపాడటానికి తన టీమ్ తో శత్రువుల పై దాడికి వెళ్తాడు. అక్కడ తన టీమ్ లోని భారతి రెండో తనయుడు జై (సత్యదేవ్) అనే సోల్జర్ తీవ్రంగా గాయపడి చనిపోయే పరిస్థితిలో వెళ్లిపోవడంతో.. చావుబతుకుల మధ్య ఉంటాడు. ఓవైపు కూతురికి పెళ్లి నిశ్చయమై.. ఆర్మీలోని కొడుకు రాక కోసం భారతి ఎదురుచూస్తున్న సమయంలో ఇలాంటి విషాదవార్తను చేరవేయాల్సి రావడంతో.. నైతిక కట్టుబాటుగా మేజర్ అజయ్ (మహేశ్‌బాబు)ను దగ్గరుండి పెళ్లి చేయించి.. ఈ వార్త చేరవేయాల్సిందిగా ఆర్మీ అధికారులు కర్నూలుకు పంపిస్తారు. అప్పటికే తన బాబాయి కొడుకు రవి మర్డర్ నేపథ్యంలో కర్నూలులో స్థానిక మినిష్టర్ నాగేంద్ర (ప్రకాశ్‌రాజ్) వల్ల భారతి చిక్కుల్లో పడుతుంది. తన కుటుంబం ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెడుతోంది. ఈ క్రమంలో శక్తిమంతుడైన నాగేంద్ర నుంచి భారతిని అజయ్ ఎలా కాపాడారు. ప్రకాష్ రాజ్ ల మధ్య ఏం జరిగింది? విజయశాంతి కుటుంబాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మహేష్ ఎలా సేవ్ చేసాడు? శివ కి విలన్ ప్రకాష్ రాజ్ కి ఎలా బుద్ధి చెప్పాడు? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు :
సూపర్‌స్టార్ మహేష్ మరోసారి తన మ్యాజిక్‌ను తెరపై చూపాడు. ఎప్పటిలాగే తన హ్యాండ్‌సమ్ లుక్‌తో, సెటిల్డ్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు. కామిక్ టైమింగ్‌తో అలరించడమే కాదు మహేష్ ఫైట్స్ అండ్ యాక్షన్ తో పాటు ఆయన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. మహేశ్ ఎంట్రీ సీన్, తమన్నాతో ‘డాంగ్ డాంగ్ సాంగ్’లో ఎనర్జిటిక్ స్టెప్పులు, ఆర్మీ ఆపరేషన్ సీన్.. ‘మైండ్ బ్లాంక్’ పాటలో మాస్ స్టెప్పులతో ఇలా తనదైన పర్ఫార్మెన్స్‌తో మహేశ్ అలరించాడు. ఫస్టాప్‌లో రైలు జర్నీ సీన్లలోనూ పంచ్ డైలాగులు, కామెడీ సీక్వెన్‌తో నవ్వించాడు. కొండారెడ్డి బురుజు వద్ద ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్‌లో యాక్షన్ పార్టు, మహేష్ హీరోయిజం ఎలివేషన్ షాట్లు ఫ్యాన్స్ ను అలరిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ పవర్‌ఫుల్‌గా ఉండటం ఫ్యాన్స్‌కు కిక్కు ఇస్తుంది. అల్లురి సీతారామరాజు సినిమాలోని సీన్‌ను సందర్భానుసారం వాడుకోవడం, సూపర్‌స్టార్ కృష్ణను గుర్తుచేయడం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అయితే, సెకండాఫ్ వచ్చేసరికి కథ పెద్దగా ఏమీ లేదని తేలిపోవడంతో మహేశ్ పాత్ర కొంచెం స్లో గా ఉంటుంది.
ఇక, చాలాకాలం తర్వాత తెరపై మీద కనిపించిన విజయశాంతి భారతిగా పవర్‌ఫుల్ పాత్రలో అలరించారు. ఆమె సహజమైన అభినయం, డైలాగ్ డెలివరీ సినిమాకు ఒకింత నిండుతనం తెచ్చాయి. నిజాయితీగా గల ప్రొఫెసర్‌గా, ఆర్మీలో కొడుకులను కోల్పోయిన తల్లిగా ఆమె అభినయం ప్రేక్షకుల్లో గౌరవభావాన్ని, కంటతడిని పెట్టిస్తాయి. ఇక, హీరోయిన్‌గా రష్మిక మందన్నా మహేశ్ సరసన తనదైన ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో అలరించింది. మీకు ఏమైనా అర్థమవుతుందా.. ఐ యామ్ ఇంప్రెస్డ్.. వంటి పంచ్ డైలాగులతో నవ్వించింది. ‘హి ఈజ్ సో’ క్యూట్ పాటలో అందంగా కనిపించిన రష్మిక.. ‘మైండ్ బ్లాక్’ పాటలో.. మాస్ లుక్‌తో గ్లామరస్ డోస్‌ను పెంచిందని చెప్పాలి. ఇక, మినిస్టర్ నాగేంద్రగా విలన్ పాత్రలో కనిపించిన ప్రకాశ్ తన పాత్ర మేరకు అలరించారు. తనదైన యాక్టింగ్‌తో ప్రకాశ్ రాజ్ మెప్పించినప్పటికీ.. సినిమా క్లైమాక్స్ వెళ్లేసరికి నాగేంద్ర పాత్ర అనేక మలుపులు తిరుగుతుంది. ఇక, రాజేంద్రప్రసాద్, కౌముది, సంగీత, రావు రమేశ్, హరితేజ తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సంక్రాంతికి ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఆకట్టుకోవడానికి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోడానికి అనిల్ రావిపూడి కామెడీతో పాటు యాక్షన్ తో పాటు కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మంచి పనితీరుని కనపరిచాడు. . కథ విషయంలో మాత్రం అనిల్ రావిపూడి పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. పైగా అనిల్ రావిపూడి అంటే ఫుల్ కామెడీ ఉంటుందనుకుంటే.. ఆ విషయంలో కూడా తడబడ్డాడు. కామెడీ బాగానే వున్నా.. ఆయన గత సినిమాల రేంజ్ లో లేదు, సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి రచయితగా దర్శకుడిగా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కథలో బలం లేకపోయినా, కామెడీతో సాగే వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చిన పాటలు ఆడియో పరంగా పెద్దగా ఆకట్టుకోకపోయినా.. సినిమాలో విజువల్ గా మాత్రం పాటలు బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. నేపధ్య సంగీతం చాలా బాగుంది. అలాగే రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఇక తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనాన్ని ఇంకా సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
విశ్లేషణ:
పక్కా కమర్షియల్ సినిమాలు తీస్తూ.. వరుస హిట్స్ అందుకుంటున్న అనిల్ రావిపూడి మరోసారి పూర్తిగా తన ఫార్మెట్‌లోనే ‘సరిలేరు నీకెవ్వరు’ను తీశాడు. తన సినిమాల్లో ఉండే అన్ని దినుసులు ఈ సినిమాలోనూ జోడించాడు. హీరో-హీరోయిన్లతో కామెడీ చేయించడం, క్యాచీ పదాలు, పంచ్ డైలాగులతో ఇలా తనకు తెలిసిన అన్ని మాస్-మసాలా అంశాలు సినిమాలో ఉండేలా చూసుకున్నాడు. ఈ విషయంలో ఫస్టాప్ వరకు సక్సెస్ అయిన డైరెక్టర్.. సెకండాఫ్ వచ్చేసరికి ఎప్పటిలాగే కథను లైట్‌గా తీసుకున్నాడనే అభిప్రాయం కలుగుతుంది. సెకండాఫ్‌లో భారతి ఎందుకు కష్టాల్లో పడిందనే అంశాన్ని అంత గ్రిప్పింగ్‌గా, స్ట్రాంగ్‌గా అనిల్ చెప్పలేకపోయాడు. ఈ సినిమాలో జోడించిన మర్డర్ మిస్టరీ ఇన్వేస్టిగేషన్, దాని వెనుక ఉన్న నాగేంద్ర కరప్షన్ ఇలాంటి అంశాలు కొత్తగా ఉండకపోగా.. రోటిన్ అనిపించి బోర్ కొడతాయి. సెకండాప్ మొదట్లోనే ప్రకాశ్ రాజ్‌ను మహేశ్ ఢీకొనడంతో.. విలన్ పాత్ర వీక్ అవుతోంది. అయితే మహేష్ నటనతో తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. అలాగే విజయశాంతి కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంత వరకు అలరిస్తుందో వేచి చూడాలి.
ప్లస్ పాయింట్స్
మహేశ్‌బాబు యాక్టింగ్, కామెడీ
విజయశాంతి నటిచడం
పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
ఫస్టాప్
మైనస్ పాయింట్స్
కథ పెద్దగా లేకపోవడం
సెంకడాఫ్ లెంగ్తీగా ఉండటం