మరో బ్లాక్‌బస్టర్ కోసం..
ఎస్.ఎస్.థమన్….సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనో మ్యూజిక్ సెన్సేషన్. ముఖ్యంగా టాలీవుడ్లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తెలుగులో ‘కిక్’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన థమన్ ఆ తర్వాత ఎన్నో సినిమాలకు సూపర్‌హిట్ మ్యూజిక్ ఇచ్చాడు. అయితే అతను చేసే ట్యూన్స్ అన్నీ లిఫ్ట్ చేసినవే అని, సొంతంగా ట్యూన్ చేసేంత టాలెంట్ అతనిలో లేదనే విమర్శలు అప్పట్లో బాగా వినిపించాయి. ట్యూన్‌ని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేసినా తన స్టైల్లో పాటల్ని సూపర్‌హిట్ చేస్తున్నాడు కదా! దాని గురించి డిస్కషన్ ఎందుకు అని కొట్టి పారేసేవాళ్ళూ ఉన్నారు. తన గురించి ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా తన జర్నీని మాత్రం ఆపలేదు థమన్. ఇటీవలికాలంలో టాలీవుడ్లో టాప్ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే థమన్ పేరే చెప్తారందరూ. అతను చేసిన లేటెస్ట్ హిట్ ఆల్బమ్ ‘అల వైకుంఠపురములో..’. ఈ సినిమా పాటలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయిపోయాయి. ఇప్పుడు పవన్‌కల్యాన్ లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కి మ్యూజిక్ చేసే అవకాశం థమన్‌కి వచ్చింది. పవన్‌కల్యాణ్ సినిమాకి ఫస్ట్‌టైమ్ మ్యూజిక్ చేస్తున్న థమన్ దాన్ని ఓ పెద్ద బాధ్యతగా భావిస్తున్నాడు. తనలోని టాలెంట్ అంతా ఉపయోగించి బ్లాక్‌బస్టర్ సాంగ్స్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు. ఆమధ్య ఉమెన్స్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. ‘మగువా.. మగువా’ అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించగా రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఈ పాట 10 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాలోని మిగతా పాటలు కూడా ఇంతకంటే పెద్ద స్థాయిలో ఉంటాయని పవన్ అభిమానులు భావిస్తున్నారు. మరి థమన్ ‘వకీల్ సాబ్’ను మ్యూజికల్‌గా ఏ రేంజ్ హిట్ చేస్తాడో చూడాలి.













