రష్మిక కెరీర్ ట్రాక్ ఎక్కినట్టేనా?
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టేసింది. ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మంచి బ్రేక్ అందుకుని, పెద్ద స్టార్లతో ఛాన్సులు కొట్టేసింది. ఆ తర్వాత రష్మిక నుంచి వచ్చిన సినిమాలు కొన్ని ఫ్లాపైనా భీష్మ, సరిలేరు నీకెవ్వరు సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంతో అమ్మడి కెరీర్ మంచి జోష్ లో కొనసాగింది.
ఆ తర్వాత రష్మిక నుంచి వచ్చిన దేవదాస్, డియర్ కామ్రేడ్, ఆడవాళ్లూ మీకు జోహార్లు ఇవేమీ మంచి ఫలితాన్నివ్వకపోవడంతో రష్మిక మార్కెట్ కు దెబ్బ పడింది. ఆ తర్వాత సీతారామం మూవీ సూపర్ హిట్ అయినా అందులో రష్మిక హీరోయిన్ కాకపోవడంతో ఆ క్రెడిట్ హీరో హీరోయిన్లకే వెళ్లిపోయింది. హిందీలో చేసిన గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు కూడా డిజాస్టర్లయ్యాయి.
తమిళ్ లో విజయ్ తో చేసిన వారసుడు సినిమాకు మంచి కలెక్షన్లైతే వచ్చాయి కానీ రష్మిక కు ప్రశంసలు మాత్రం రాలేదు. ఇప్పుడు ఆ లెక్కలన్నింటినీ రణ్బీర్ తో చేసిన యానిమల్ సినిమా సరిచేసిందని అందరూ అంటున్నార. రణ్బీర్ భార్యగా ఈ సినిమాలో రష్మికకు మంచి పాత్ర దక్కింది. ఆ అవకాశాన్ని అమ్మడు కూడా బాగా వినియోగించుకుందని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు.
ఇంకా చెప్పాలంటే అసలు రష్మికలోని నటి బాలీవుడ్ ఆడియన్స్ కు పరిచయమైంది ఈ సినిమాతోనే అంటున్నారు. ఈ సినిమా తర్వాత పుష్ప2 వచ్చే ఏడాది ఆగస్ట్ లో రాబోతుంది. ఇవి కాకుండా రెయిన్ బో కలిపి రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా మూడు ప్రొడక్షన్ హౌస్ ల నుంచి అమ్మడికి ఆఫర్లొచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో కూడా రష్మికనే తీసుకోవాలని సందీప్ చూస్తున్నాడని ముంబై వర్గాలంటున్నాయి. ఇదంతా చూస్తుంటే రష్మిక కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడ్డట్లే అనిపిస్తోంది.













