సీఎం చంద్రబాబును కలిసిన దగ్గుబాటి రానా
యువ కథానాయకుడు దగ్గుబాటి రానా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. విశ్వ విఖ్యాత నటసౌర్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా యన్టిఆర్ బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రకు రానాను ఎంపిక చేశారు. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సందర్భంగా తన పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాలని భావించిన రానా, చంద్రబాబును కలిసి ఈ సినిమా గురించి చర్చించారు. ఈ సందర్బంగా దిగిన ఫొటోలను సోషల్మీడియాలో పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో నటిస్తున్నందుకు చాలా గౌరవంగా ఫీలవుతున్నాను. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సర్ అని పేర్కొన్నారు. రానా చంద్రబాబు హావభావాల్ని ప్రత్యేకంగా పరిశీలిస్తూ, ఆయన తరహా గెటప్ ధరించి టెస్ట్ షూట్లో పాల్గొన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో బాలకృష్ణ, చిత్ర దర్శకుడు క్రిష్ కూడా పాల్గొన్నారు.













