మిస్టర్ బచ్చన్‌పై భారీ కౌంటర్లు
బాలీవుడ్ హిట్ సినిమా రైడ్ ను తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. మొదట్లో నాగార్జున హీరోగా ఈ సినిమాను తీయాలనుకున్నారు కానీ అది కుదరలేదు. ఆఖరికి రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో గతేడాది ఈ సినిమా పట్టాలెక్కింది. రీమేక్ కథలను తీసుకుని వాటిని తెలుగు నేటివిటీకి తగ్గట్టు తీయడంలో దిట్టగా పేరొందిన హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ ను కూడా అదే రీతిలో తీస్తాడని అందరూ చాలానే ఆశలు పెట్టుకున్నారు.
కానీ మిస్టర్ బచ్చన్ రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. ఈ రిజల్ట్ హీరో, డైరెక్టర్ తో పాటూ నిర్మాతలకు కూడా పెద్ద షాకిచ్చింది. నష్టాలు భారీగా రావడంతో హరీష్ శంకర్, రవితేజ తమ రెమ్యూనరేషన్ లోంచి కొంత వెనుక్కిచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఇదిలా ఉంటే రైడ్ సినిమాకు హిందీలో సీక్వెల్ తెరకెక్కుతుండటం విశేషం. రైడ్2 వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. రైడ్ లో నటించిన అజయ్ దేవగణే ఈ సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో టీ సిరీస్ భారీగా ఈ సినిమాను నిర్మించనుంది. అయితే బాలీవుడ్ రైడ్2 ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమాను కూడా రీమేక్ చేస్తారా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ టైమ్ లో హరీష్ శంకర్ మాట్లాడుతూ మిస్టర్ బచ్చన్ ను రైడ్ టీమ్ చూస్తే మళ్లీ దీన్ని వాళ్లు రీమేక్ చేస్తారని చెప్పిన వీడియోను కట్ చేసి ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నది మిస్టర్ బచ్చన్ నేనా అని కౌంటర్లు వేస్తున్నారు.













