అమ్మాయిలను అసభ్యంగా చూపిస్తాడు.. అతను చెబితే మేం వినాలా?
సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఎప్పుడూ వివాదాలతోనే గడుపుతుంటారు. వారు తమకు సంబంధం ఉన్నా లేకపోయినా అన్ని విషయాల్లో వేలు పెడుతుంటారు. అనవసరమైన కామెంట్లు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు. కానీ, కొంతమంది మాత్రం ఎప్పుడూ ఎవరినీ కామెంట్ చెయ్యరు. తమకు సంబంధంలేని విషయాల గురించి ఎక్కడా మాట్లాడరు. కానీ, వారి టైమ్ బాగోనప్పుడు మాత్రం ఎక్కడో ఒకచోట ఇరుక్కుంటారు. హీరో రామ్ విషయాన్నే తీసుకుంటే పొలిటికల్‌గా గానీ, మరో విషయంలోగానీ ఎప్పుడూ కామెంట్ చేసి ఎరుగని అతను ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంపై పలు కామెంట్స్ చేసి కొందరి ఆగ్రహానికి గురయ్యాడు. తాజాగా పూరి జగన్నాథ్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడూ తన పనేదో తాను చేసుకుంటూ తనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోని పూరి ఇటీవల రిజర్వేషన్లపై కొన్ని కామెంట్లు చేశాడు.
రిజర్వేషన్లు అనేవి కులాన్ని బట్టి ఉండకూడదని, పేదవాడు ఏ కులంలోనే ఉన్నాసరే వారిని సపోర్ట్ చెయ్యాలని అన్నాడు. అంతేకాదు రిజర్వేషన్లు తీసుకోవడం అంటే అడుక్కు తినడంతో సమానమని వ్యాఖ్యానించాడు. పూరి చేసిన కామెట్లపై దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూరిని టార్గెట్ చేస్తూ అతని గురించి, అతని సినిమాల గురించి విమర్శించడం మొదలుపెట్టారు. అమ్మాయిలను అసభ్యంగా చూపిస్తాడు, దానికి తగ్గట్టుగానే డైలాగులు కూడా అలాగే రాస్తాడు. వీడు చెబితే మేం వినాలా అంటూ వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతేకాదు పూరి మరో విషయాన్ని కూడా ప్రస్తావించాడు. అదేమిటంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వారి ఓటు హక్కు రద్దు చేయాలని. దీనిపై దళిత నేతలు మాట్లాడుతూ వైట్ రేషన్ కార్డులు ఉన్నవారు సినిమాలు కూడా చూడకూడదని చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. ఈ విషయంలో పూరిని చూసి నెటిజన్లు జాలి పడుతున్నారు. ఎప్పుడూ ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చేయని పూరి ఇలాంటి వివాదాంలో ఇరుక్కోవడం బాధాకరమని అంటున్నారు.













