పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో PSPK#28 కాన్సెప్ట్ పోస్టర్
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో గతంలో ‘గబ్బర్ సింగ్’ సినిమా వచ్చింది. సుమారు 8 ఏళ్ల తరవాత మళ్లీ ఇప్పుడు ఈ కాంబో సెట్ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.
అయితే, నేడు (సెప్టెంబర్ 2న) పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురష్కరించుకుని ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇది పవన్ కళ్యాణ్‌కు 28వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి PSPK 28 అని పిలుస్తున్నారు. ఇదే టైటిల్లో కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. వెనుక ఇండియా గేట్.. దాని ముందు ఖరీదైన హార్లే డేవిడ్సన్ క్రూజర్ బైక్.. దానిపై పెద్దబాలశిక్ష, గులాబి పువ్వును ఉంచారు. అంతేకాదు, ఇండియా గేట్‌పై సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలు కూడా ఉంచారు. అంటే, ఇది కచ్చితంగా దేశభక్తికి సంబంధించిన సినిమా అని అర్థమవుతోంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్లో ‘‘ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు’’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. అంటే, ఏదో గట్టి మెసేజ్ ఇవ్వబోతున్నారు.













