ప్రభాస్ మనసు బంగారం..
తనతో పాటూ తన చుట్టుపక్కల ఉండేవారు కూడా ఎదగాలనుకునే హీరోల్లో ప్రభాస్ ముందుంటాడు. ప్రభాస్ గురించి, ఆయన మంచితనం గురించి ప్రతీ ఒక్కరూ చాలా మంచిగా చెప్తుంటారు. ఈ నేపథ్యంలో తన ఫ్రెండ్స్ తో యువి క్రియేషన్స్ అనే బ్యానర్ పెట్టించి, దాంట్లో అతను సినిమాలు చేసి ఆ బ్యానర్ ను టాలీవుడ్ లో టాప్ బ్యానర్లలో ఒకటిగా మార్చాడు.
అంతేకాదు బాహుబలి తర్వాత తన రెండు సినిమాలు వాళ్ల నిర్మాణంలోనే చేశాడు. బాహుబలి తో పాన్ ఇండియన్ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కోసం ఈ రెండు సినిమాలకు యువి నిర్మాతలు అసలు ఆలోచించకుండా ఖర్చు పెట్టి, చివరకు తీవ్ర నష్టాలపాలయ్యారు. ప్రభాస్ ఇచ్చిన బంగారం లాంటి ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు.
దీంతో యువి నిర్మాతల దగ్గర మళ్లీ పెద్ద సినిమాలు చేయడానికి డబ్బులు కూడా లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న తన ఫ్రెండ్స్ ను మళ్లీ ప్రభాసే ఆదుకున్నట్లు తెలుస్తుంది. తను నటించిన ఆదిపురుష్ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా తక్కువకు రూ.80 కోట్లకు నిర్మాత నుంచి ఇప్పించాడు.
ఇప్పుడు ఆ రైట్స్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లకు 160 కోట్లకు అమ్మించి పెద్ద మొత్తంలో లాభాన్ని సమకూర్చాడు ప్రభాస్. అంతేకాదు తన తర్వాతి సినిమా స్పిరిట్ లో యువి నిర్మాణ భాగస్వాములుగా ఉండగా, ఆ సినిమా నుంచి వారిని తప్పించి ఆ నిర్మాణ భాగస్వామ్యాన్ని కూడా పీపుల్స్ మీడియా బ్యానర్ కే అప్పజెప్పించి, దాని కోసం యువి నిర్మాతలకు పెద్ద మొత్తంలోనే డబ్బులు ముట్టించినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ ను పైకి తీసుకురావాలన్న తపనతో ప్రభాస్ ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన మనసు బంగారం అని ప్రశంసిస్తున్నారు.













