రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ డీల్
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతాడు మాస్ మహారాజా రవితేజ. సంవత్సరానికి దాదాపు మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేయడమే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లు మంచి కథతో వచ్చి రవితేజను మెప్పిస్తే చాలు సినిమా పట్టాలెక్కినట్లే అనుకోవచ్చు.
ఇప్పటికే చాలా మంది డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రవితేజ, చాలా మంది ఆయనతో చేసిన సినిమాల వల్ల స్టార్ డైరెక్టర్లుగా మారారు. పూరీ నుంచి గోపీచంద్ మలినేని వరకు ఎంతో మంది ఇలా వచ్చిన వాళ్లే. డైరెక్టర్లే కాదు నిర్మాతలు కూడా రవితేజతో సినిమాలు చేయడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటారు.
ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్న రవితేజ, ఆ తర్వాతి సినిమాటోగ్రఫర్ కార్తిక్ ఘట్టమనేనితో ఈగల్ సినిమా చేయనున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటూ రవితేజతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరో మూడు సినిమాలు చేయనున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఓ డీల్ కూడా జరిగిందట.
రవితేజ ఈ నాలుగు సినిమాలకు కలిపి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ ను అందుకోనున్నట్లు సమాచారం. అంటే రవితేజ ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల పారితోషికం అందుకున్నట్లు లెక్క. ఈగల్ తర్వాత రవితేజ కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ తో ఓ సినిమా, ప్రసన్న కుమార్ బెజవాడతో ఓ సినిమాను లైన్ లో పెట్టాడు. ఇది కాకుండా మైత్రీతో గోపీచంద్ మలినేని తో మరో సినిమా చేయనున్నాడు రవితేజ.













