విజయవాడలో పెద్ది గ్రాండ్ ఈవెంట్
పెద్ది(Peddi) సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేలా చిత్ర బృందం భారీ ప్రమోషన్ వ్యూహంతో ముందుకు సాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా మొదటి నుంచే పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విడుదలైన పోస్టర్లు, టీజర్ విజువల్స్, బ్యాక్‌డ్రాప్.. అన్నీ కలిసి సినిమాకు మాస్‌తో పాటు క్లాస్ ఆడియన్స్‌లోనూ మంచి బజ్‌ను తీసుకొచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ వాతావరణం, స్పోర్ట్స్ ఎమోషన్స్, రామ్ చరణ్ మేకోవర్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
సినిమా ప్రమోషన్స్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం(Indira Gandhi Municipal Stadium) వేదికగా భారీ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్లో ఇప్పటివరకు చూడని స్థాయిలో ఈ వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు స్టార్ నటులు, ప్రముఖ సినీ వ్యక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల భోపాల్‌లో నిర్వహించిన ఈవెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ తో ఉత్సాహంగా ఉన్న నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) విజయవాడ కార్యక్రమాన్ని మరింత గ్రాండ్‌గా మలచాలని భావిస్తున్నారట. భారీ జన సంద్రాన్ని ఆకర్షించేలా ప్రత్యేక స్టేజ్ డిజైన్, ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, విజువల్ ప్రెజెంటేషన్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రిలీజ్ కు ముందే ఇలాంటి భారీ ప్రమోషన్ కార్యక్రమాలతో పెద్ది సినిమా దేశవ్యాప్తంగా మరింత చర్చనీయాంశంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.







