బ్రో తర్వాత ఓజీనేనా..?
ఓ వైపు రాజకీయాలతో మరోవైపు వరుస సినిమాలతో ఎవరూ లేనంత బిజీగా గడుపుతున్నాడు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాల్లో ఒకేసారి నటిస్తూ బిజియెస్ట్ హీరో అనిపించుకుంటున్నాడు. పవన్ ఇంతకుముందెప్పుడూ ఇలా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించింది లేదు.
అది కూడా రాజకీయాల్లో పవన్ బిజీగా ఉంటున్న సమయంలో ఇలా సినిమాల కోసం ఇంతలా కష్టపడటం అంటే మాటలు కాదు మరి. ఇప్పటికే పవన్ కళ్యాణ్, సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న బ్రో సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఆశ్చర్యపరచగా, ఆ సినిమా వచ్చే నెలలోనే థియేటర్లలోకి రాబోతుంది.
అయితే బ్రో తర్వాత రిలీజ్ అయ్యే పవన్ మూవీ ఏంటనే విషయంపైనే ఇప్పుడు అందరి దృష్టి. ఎప్పట్నుంచో పూర్తి కాకుండా అలాగే బ్యాలెన్స్ ఉంచిన హరిహర వీరమల్లు పూర్తి చేస్తాడేమో అంటే పవన్ అటు వైపే చూడట్లేదు. గ్యాప్ దొరికితే మిగిలిన సినిమాల గురించి ఆలోచిస్తున్నాడు పవన్. చూస్తుంటే ఈ ఏడాది హరిహర వీరమల్లు రిలీజ్ అసాధ్యమే.
ఇక మిగిలింది ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజీ సినిమాలు. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. కానీ పవన్ ఎవరికి డేట్లు ఇస్తే వారే ముందుకు దూసుకుపోతున్నారు. మొదట్లో ఊపుగా మొదలైన ఉస్తాద్, రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుని టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ ఓజీకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడు.
ఇప్పటికే ఓజీ మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా, పవన్ తర్వాత డేట్లు ఉస్తాద్ కు ఇస్తాడనుకుంటే మళ్లీ పవన్ ఓజీ నాలుగో షెడ్యూల్ కు కాల్షీట్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఉస్తాద్ టీమ్ కు నిరాశే మిగిలింది. చూస్తుంటే చకచక షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే అంటే ఈ ఏడాదే ఓజీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ఉన్నారు మేకర్స్. మరి ఏమవుతుందో చూడాలి.













