OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం ‘ఓజీ’ (OG). సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించబడ్డాయి. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా పనితనం కలిసి.. ‘ఓజీ’ని హాలీవుడ్ స్థాయి చిత్రంగా నిలిపాయి. ఓజీ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందుతూ భారీ వసూళ్ళతో దూసుకుపోతోంది. మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.252 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఓజీ.. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రంగా నిలవడమే కాకకుండా, తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో చిత్ర విజయోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ తో పాటు, చిత్ర బృందమంతా హాజరై విజయానందాన్ని పంచుకున్నారు.
ఈ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ముందుగా ఇక్కడకి వచ్చిన మీడియా వాళ్ళకి, అభిమానులకి, స్నేహితులకి, సోదర సోదరీమణులు అందరికీ ఓజీ యూనిట్ తరుపున నా హృదయపూర్వక నమస్కారాలు. ఓజీ సినిమా అనేది మా అందరికి చాలా చక్కటి అనుభూతి. చాలా అరుదుగా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి, గ్రేట్ కలెక్షన్స్ వస్తుంటాయి. కానీ, ఒక సెలబ్రేషన్ లాగా ఒక సినిమా రిలీజ్ అవ్వడం చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం మాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఒక సినిమా సుజిత్ గారు ద్వారా నాకు రావడం. దానికి తమన్ జీవం పోయడం, రవి కె చంద్రన్ గారు ఫోటోగ్రఫ, ఇమ్రాన్ హష్మీ గారు, ప్రియాంక మోహన్ గారు, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, డీవీవీ దానయ్య గారు ఇలా ఈ సినిమా గొప్పగా రావడానికి కారణమైన అందరికీ కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఒక సినిమా కథని రాయడం, చెప్పడం చాలా ఈజీ.. కానీ రాసిన కథను తెర మీదకు అలాగే తీసుకురావడం చాలా కష్టం. ఎందుకు అంటే డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ మ్యాన్ వరుకు అందరూ కలిసి కట్టుగా పని చెయ్యాలి. అది ఓజీ విషయంలో జరిగింది. మీకు ఒక విషయం చెప్పాలి. అసలు ఇప్పటి వరుకు ఓజీ స్టోరీ ఏంటో నాకు తెలీదు. త్రివిక్రమ్ గారు నేను మాట్లాడుకుంటున్నపుడు సుజిత్ టాపిక్ వచ్చింది.
అలా ఓజీ స్టోరీ వినడానికి ఆయనని కలవడం జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే, మీరు ఒక కత్తి పట్టుకుని జపానీస్ డ్రెస్ లో ఉంటారు. గన్స్ ఉంటాయి, మీరు ఒక గ్యాంగ్ స్టర్. ఇలాగే చెప్పాడు కథ, నాకు ఏం అర్థం కాలేదు. కానీ సుజిత్ నాకు ఇచ్చిన పేపర్స్ ను మా అబ్బాయి అకీరా నందన్ చదువుతూ చాలా ఆనందం పడుతూ ఉండేవాడు. అప్పుడు అనిపించింది, ఈ తరం వాళ్ళకి అర్థం అయ్యే కథే ఓజీ సినిమా అని. కొన్ని సార్లు సుజిత్ లో నన్ను నేను చూసుకుంటా. ఎందుకు అంటే కొన్ని సార్లు మనం చెప్పాలి అనుకున్నది చెప్పలేకపోవచ్చు, కానీ చేసి చూపించగలం అని నేను బాగా నమ్ముతా. అది సుజిత్ లో నాకు కనిపించింది. అందుకే సుజిత్ కి నేను ఒక మాట ఇచ్చాను. ఓజీ సీక్వెల్ గానీ, ప్రీక్వెల్ గానీ మనం చేస్తున్నాం అని. ఒక ఫ్లాప్ సినిమా ఎంత నిరుత్సాహ పరుస్తుందో నాకు తెలుసు. కానీ ఓజీ సినిమా నాకు మళ్లీ సినిమా చేయాలి అనే బలాన్ని ఇచ్చింది. కాబట్టి నాకు ఉన్న సమయం లో ఓజి యూనివర్స్ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా తమన్ ఇచ్చిన సంగీతం నన్ను తమ్ముడు సినిమా రోజులకి తీసుకువెళ్లింది. అలాగే అర్జున్ దాస్ అతని చూసినపుడు నేను చాలా ఫీల్ అవుతాను అలాంటి గొంతు నాకు లేదు అని. ఓజీ యూనివర్స్ లో భాగం అయిన ప్రతి ఒకరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.” అన్నారు.
చిత్ర దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక కథ కూడా రాసుకోలేదు ఆయన కోసం. కానీ ప్రకృతి ఎంత బలమైంది అంటే నన్ను తీసుకువచ్చి పవన్ గారితో సినిమా చేసేలాగా చేసింది. త్రివిక్రమ్ గారి వల్ల ఈ అవకాశం రావడం నాకు సంతోషంగా ఉంది. ఆయనే వచ్చి నువ్వు పవన్ గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. తర్వాత డీవీవీ దానయ్య గారిని కలవడం జరిగింది. ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలి దానికి నీకు ఏం కావాలి. నేను పవన్ కళ్యాణ్ గారికి నా బ్యానర్ లో ఒక హిట్ ఇవ్వాలి అనేసరికి.. నా నోటి నుంచి మాట రాలేదు. అంత సపోర్ట్ చేశారు సినిమా పూర్తి అయ్యేవరుకు. ఇంకా సినిమా బ్యాక్ బోన్ అనిపంచుకుంటున్న తమన్ అన్న సినిమాకే కాదు నాకు కూడా ఒక బ్యాక్ బోన్ లా నుంచున్నాడు సినిమా పూర్తి అయ్యేవరుకు. మిగతా తారాగణం అంతా కూడా సినిమాకి చాలా సపోర్టివ్ గా ఉన్నారు.
రవి కె చంద్రన్ గారికి ముందు స్టోరీ చెప్పడానికి వెళ్ళినపుడు 6 గంటలు తీసుకున్న సినిమా ఇలా ఉంటుంది అని చెప్పడానికి. అప్పుడు ఆయన నిజంగా ఈ సినిమా పవన్ గారు ఒప్పుకున్నారా అని అడిగారు. తర్వాత రోజు సెకండ్ హాప్ చెప్పే సరికి. ఓకే అదిరిపోయింది ఫస్ట్ హాఫ్ సంగతి మనం చూసుకుందాం అని ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను థాంక్యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తునంత సేపు ఆయనని ఒక విషయం అడగడానికి ధైర్యం సరిపోలేదు. ఎలా ఐతే ఒక రోజు ముంబై లో షూటింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ మొత్తంతో అడిగించిన తర్వాత నేను అడిగా. సార్ ఈ సినిమా హిట్ అయితే ఇంకొక సినిమా చేద్దాం సార్ అని. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం వల్లే ఈరోజు ఓజీ యూనివర్స్ స్టార్ట్ అయ్యింది. థాంక్యూ సార్.” అన్నారు.
చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ.. “నేను ఈ సినిమా చేయడానికి ముఖ్యకారణం, దర్శకుడు త్రివిక్రమ్ గారు. ఆయన వల్లే ఈ సినిమా చెయ్యగలిగాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడి, అలాగే ఇష్టపడి మరీ ఈ సినిమాని చేశారు. అద్భుతంగా నటించారు. సుజిత్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. సోదరుడు తమన్ కూడా బాగా కష్టపడి చేశాడు. రవి కె చంద్రన్ గారు, అర్జున్ దాస్ గారు, శ్రియా రెడ్డి గారు, ప్రియాంక మోహన్ గారు, సాంకేతిక నిపుణులు అందరూ కూడా బాగా కష్టపడి చేశారు. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు అందరికి నా ధన్యవాదాలు.” అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ.. “ఓజీ సినిమా మా అందరికీ ఒక మిరాకిల్ లాంటిది. సుజీత్, నాతో సహా అందరూ ఎంతో భయంతో, బాధ్యతతో ఈ సినిమా చేశారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా టీమ్ కష్టపడి పని చేశారు. ఓజీ సినిమా ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ప్రజా నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ ను, ఆయన అభిమానుల్లో ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకొని సుజీత్, నేను ఎంతో బాధ్యతగా పని చేశాం. ఇది మా విజయం కాదు, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల విజయం.” అన్నారు.
కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ మాట్లాడుతూ.. “ఓజీ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థాంక్స్. నేను ఇప్పటి వరుకు చాలా సినిమాలు చేశాను కానీ, నాకు ఓజీలో కన్మణి పాత్రకి వచ్చినంత మద్దతు, ప్రోత్సాహం ఏ సినిమాకి రాలేదు.నిజంగా తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. కన్మణి లాంటి పాత్ర నాకు ఇచ్చినందుకు దర్శకుడు సుజీత్ గారికి కృతఙ్ఞతలు. భవిష్యత్ లో నేను ఎన్ని సినిమాలు చేసినా కన్మణి పాత్ర మాత్రం నాకు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. అలాగే తమన్ సంగీతం గురించి నేను ముందే చెప్పాను.. థియేటర్స్ మొత్తం ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లాగా మారతాయి అని. ఇప్పుడు అదే జరుగుతుంది. నిజంగా ఒక ట్రాన్స్ లో లోకి తీసుకెళ్ళే సంగీతం అందించారు. దానయ్య గారి బ్యానర్ లో రెండో సినిమా చేయడం నాకు చాలా సంతోషం గా ఉంది. ఇలాంటి సూపర్ హిట్స్ ఇచ్చినందుకు దానయ్య గారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మామూలుగానే మీకు పెద్ద ఫ్యాన్ ని. ఇప్పుడు ఆయనతో కలిసి పని చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది.” అన్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడేలా చేశాడు సుజీత్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు.. కళ్యాణ్ గారిని మనం ఎలా చూడాలి అనుకుంటున్నామో, అలాంటి లుక్ లో చూసినప్పటి నుంచి సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురు చూశారు. సెప్టెంబర్ 24 రాత్రి సుదర్శన్ థియేటర్ లోనే నేను కూడా సినిమా చూడటం జరిగింది. కళ్యాణ్ గారి క్రేజ్ ఎలా ఉంటుందో నాకు తొలిప్రేమ సినిమా నుంచి తెలుసు. ఐతే ఇలాంటి ఒక సినిమాని రాసి, కళ్యాణ్ గారికి చెప్పి ఒప్పించినందుకు సుజిత్ కి చాలా థాంక్స్. అలాగే, ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కళ్యాణ్ గారికి ఇచ్చినందుకు తమన్ కి కూడా చాలా థాంక్స్. చివరిగా ఒక్క మాట.. పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీ గా ఉన్నా ఏడాదికి ఒకసారి ఓజీ లాంటి సినిమా ఇస్తే సంతోషిస్తాం.” అన్నారు.
ఈ వేడుకలో నటీనటులు శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, వెంకట్, ఛాయాగ్రాహకుడు రవి కె చంద్రన్, కళా దర్శకుడు ఏఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొని ‘ఓజీ’ సినిమా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.