పవన్ తో తెరపై జో”ఢీ” అననున్న స్టార్ ?
అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే మళయాళ చిత్రం.. గత కొన్ని నెలలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వార్తల్లో చిత్రంగా మారింది. దీనికి కారణం ఆ చిత్రం అత్యంత విజయవంతం కావడం మాత్రమే కాదు.. ఆ సినిమాకు కలెక్షన్లతో పాటు విమర్శకుల ప్రశంసల వర్షం కురవడం మాత్రమే కాదు.. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకోవడమే ప్రధాన కారణం. మల్టీస్టారర్‌గా వచ్చిన ఆ సినిమాలో ఇద్దరు కధానాయకులు పోషించిన పవర్ ఫుల్ పాత్రలకు పలువురు తెలుగు స్టార్ హీరోల పేర్లు వినపడ్డాయి. తొలుత నందమూరి బాలకృష్ణ, రానా దగ్గుబాటి ఈ రెండు పాత్రలూ పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రవితేజ, రానా పేర్లు వినపడ్డాయి. అలా అలా చివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో స్థిరపడ్డాయి.
ఎట్టకేలకు ఆ సినిమాలో అయ్యప్పన్ నాయర్ అనే పోలీసాఫీసర్ పాత్రలో పవన్ కనిపించనున్నట్టు ఇటీవలే ఆ సినిమా హక్కులు పొందిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రకటించింది. విధి నిర్వహణలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న పోలీసాఫీసర్ గా మళయాళంలో బిజూ మీనన్ అద్భుతంగా పండించిన పాత్రకు పవన్ ను ఎంపిక చేయడం రైట్ ఛాయిస్ అని సర్వత్రా వినిపిస్తోంది. అదే సమయంలో ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రకు ధీటుగా కోషియన్ కురియన్ అనే ఒక రిటైర్ ఆర్మీ హవల్దార్ పాత్రను పండించిన పృధ్వి రాజ్ క్యారెక్టర్‌కు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో తెలుగులో ఈ రెండు పాత్రలను ధరించడానికి ఇద్దరిద్దరు చొప్పున స్టార్స్ పేర్లు వినపడితే.. నిజంగా నిర్ణయించేటప్పుడు మాత్రం ఒక్క స్టార్‌నే ఎంపిక చేయడం విశేషం. సితార సంస్థ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సూర్యదేవర నాగవంశీ ఇప్పుడు పవన్‌కు ధీటుగా మెప్పించే స్టార్ కోసం నిశితంగా అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం తమిళ హీరో విజయ్ సేతుపతితో పాటు కన్నడ స్టార్ సుదీప్ వంటి పేర్లు పరిశీలిస్తున్నారని సమాచారం. పవన్‌ను తెరపై ఢీ కొట్టే స్టార్ ఎవరు కానున్నారనేది మరికొన్ని రోజుల్లోనే వెల్లడి కానుంది.













