రివ్యూ : ‘పైసా వసూల్’ పూరి కథ థోడా..బాలయ్య యాక్టింగ్ తేడా…

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ 3/5
బ్యానర్ : భవ్య క్రియేషన్స్,
నటీనటులు : నందమూరి బాల కృష్ణ , శ్రియ, ముస్కాన్, కైరా దత్, అలీ, పృథ్వీ రాజ్, పవిత్రా లోకేష్,
అలోక్ జైన్, విక్రమ్ జిత్, మరియు ప్రత్యేక పాత్ర లో కబీర్ బేడి నటించారు.
సినిమాటోగ్రఫీ: ముకేశ్ జి, ఎడిటర్ : జునైద్ సిద్దిక్వి, సంగీతం : అనూప్ రూబెన్స్
పాటలు : భాస్కర బట్ల రవి కుమార్, అనూప్ రూబెన్స్, పులగం చిన్నరాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి, నిర్మాత : వి .ఆనంద్ ప్రసాద్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం : పూరి జగన్నాథ్
విడుదల తేదీ : 01.09.2017
గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ 100వ సినిమాతో తన కెరీర్‌లోనే సూపర్ హిట్ కొట్టిన బాలకృష్ణ – టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 101వ సినిమా అనగానే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి హైప్ వచ్చింది. పూరి చివరి నాలుగు సినిమాలు ప్లాప్ అయినా ఈ సినిమాపై మాత్రం హైప్ ఉంది. పూరి బాలయ్యను ఎలా చూపిస్తాడా అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే అటు ఓవర్సీస్‌తో పాటు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమిమర్ షోల తర్వాత ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ట్రైలర్, టీజర్‌లలో చూపించిన విధంగానే సినిమాలో కూడా బాలయ్య చెలరేగిపోయాడా? బాలయ్య యాటిట్యూడ్ డిఫరెంట్‌గా నే ఉందా…. పూరి బాలయ్యని చూపించిన విధానం ఎలా వుంది? పూరి పంచ్ డైలాగులు పెలాయా? సమీక్ష లో తెలుసుకుందాం….
కథ:
బాబ్ మార్లీ అనే ఇంటర్నేషనల్ క్రిమినల్ తన తమ్ముడి మరణానికి కారణమైన ఇండియన్ రా ఏజెన్సీ మీద పగబట్టి భారతదేశంలో అన్ని రకాల అక్రమాలకు పాల్పడుతుంటాడు. అతనికి కొందరు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండటంతో ఇండియన్ రా ఏజెన్సీ పెద్దలు కూడా లీగల్ గా అతన్ని ఏమీ చేయలేక అడ్డదారిలోనే అతన్ని అంతమొందించాలని ప్లాన్ వేసి, అందుకు అనుగుణమైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటారు.అలాంటి సమయంలోనే ఎవరన్నా భయం లేకుండా, ఇడియట్ లాంటి హీరో, తెగింపుగా బ్రతికే క్రిమినల్ తేడా సింగ్ (బాలక్రిష్ణ) పేరుకి తగ్గట్టే పోకిరి. తిక్క రేగితే ఎవ్వరినైనా ఎదిరిస్తాడు. ఫైటింగులంటే పిచ్చ సరదా. పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా వీడిలాంటోడి కోసం ఎదురుచూస్తుంటుంది. ఇలాంటి వాడితోనే ఇంటర్నేషనల్ డాన్ అయిన బాబ్ మార్లే పట్టుకోవాలనుకొంటుంది. దానికి సై అంటాడు తేడా సింగ్! మరి తేడా సింగ్‌కి ఆ డాన్ దొరికాడా? అసలు తేడా సింగ్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? తన నేపథ్యం ఏమిటి? పోర్చుగల్లో తప్పిపోయిన సారిక ఎవరు? తనకీ తేడాసింగ్‌కి సంబంధం ఏమిటి? అనేదే మిగతా కథ..
ఆర్టిస్ట్స్ పెర్పార్మెన్సు :
బాలకృష్ణ తేడా సింగ్ పాత్రలో పూర్తిగా పండిపోయాడు. అతని కోసం.. అతని డైలాగుల కోసం, మేనరిజం కోసమే మేం పైసా వసూల్ చూస్తాం అనుకొంటే నిరభ్యంతరంగా ఈ సినిమా చూడొచ్చు. బాలయ్య కూడా ఏలోటూ చేయడు. ఈ సినిమా లో ఓ కొత్త బాలయ్యని చూడడం ఖాయం. ఈ సినిమాలో ఓ జోక్ వేయాలన్నా బాలయ్యే, ఓ పంచ్ పడాలన్నా బాలయ్యే.. ఏం చేసినా బాలయ్యే. అలా వన్ మాన్ షో అయిపోయింది. గౌతమి పుత్ర తరవాత…. బాలయ్య మేకొవర్ ఇలా ఉంటుందని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేయరు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా శ్రియకే అగ్రతాంబూలం. అయితే.. ఆమె గ్లామర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. పూరి సినిమాల్లో విలన్లు ఏం చేస్తారో, ఏం చేయగలరో.. ఈసినిమాలోనూ విలన్ గ్యాంగ్ అదే చేసింది.. అలానే నటించింది. పూరి ప్రతీ సినిమాలోనూ అలీ పాత్ర పేలిపోతుంటుంది. కానీ అలీ ని గుర్తు ఉంచుకునే పాత్ర కాదు. ఫృథ్వీ నుంచి ఒక్క జోక్ పేలకపోవడం ఈ సినిమా లో విశేషం. మిగతా హీరోయిన్స్ గ్లామర్ డాల్స్ గా కనిపిస్తారు అంతే…
సాంకేతిక వర్గం:
పూరి సినిమాలు అంటేనే సంక్లిష్టంగా ఉండవు. పైసా వసూల్ కూడా అందుకు మినహాయింపు కాదు. ఫస్టాఫ్ వరకు ఎంటర్‌టైన్‌మెంట్, బాలయ్య స్టైల్, లుక్స్, కొత్త మేనరిజమ్స్‌తో సినిమాను బాగా నడిపించిన పూరి సెకండాఫ్‌లో పేలవమైన స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌తో బోర్ కొట్టించేశాడు. పూరి కథ దగ్గర నుంచి సినిమా తీయడం వరకు అంతా హడావిడిగానే లాగించేస్తాడు. ఈ సినిమాలోను అదే హడావిడి చూపించాడు. పుష్కరం క్రితం వచ్చిన ‘పోకిరి’ హ్యాంగోవర్ నుంచి పూరి…పూర్తిగా ఇంకా బయటపడకపోవడం సినిమా దురదృష్టం. బలంగా లేని కథ, బలహీనమైన కథనాలతో సినిమా సెకండాఫ్ బోరింగ్‌గా తయారైంది. రొటీన్ మాఫియా స్టోరీ, గ్యాంగ్‌స్టర్స్, ప్లాట్ నెరేషన్, కసరత్తులేని స్క్రీన్ ప్లేతో సినిమా లాగేశాడు. పూరీ కథ, కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని పాతవే అయినా, పూరి డైలాగ్ రైటర్‌గా సక్సెస్ అయ్యాడు. దర్శకుడు పూరి ఎలాగైతే బాలయ్య పాత్రను రాశారో అలాగే కబడ్డాడు బాలయ్య. ఎప్పుడూ నవ్వుతూ, భయమనేదే లేకుండా, సరదా సరదాగా ఉంటూ, నచ్చింది చేసే క్రిమినల్ గా బాలయ్య మెప్పించాడు. కేవలం బాలయ్య తన భుజస్కంధాల మీద సినిమాను కొంత వరకు లాక్కుచ్చాడు. సినిమా నిడివి పరంగా చిన్నదే. ఆ విషయంలో ఎడిటర్ కాస్త షార్ప్‌నెస్ చూపించాడు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మాణ విలువలు భారీగా వున్నాయి.
విశ్లేషణ :
ఈ ‘పైసా వసూల్’ చిత్రంలో ముందు నుండి చెబుతున్నట్టు బాలయ్య కొత్తగానే కనబడ్డారు కానీ కథ, కథనంలోని సన్నివేశాలు, ట్విస్టులు వంటి ప్రధాన అంశాలు పాతవి పైగా బలహీనమైనవి కావడంతో చాలా మందికి సినిమా కొంచెం నిరుత్సాహకారంగానే అనిపిస్తుంది. అయితే బాలక్రిష్ణ పెర్ఫార్మెన్స్ మాత్రం ఆయన అభిమానులకు, మాస్ ఆడియన్సుకు మంచి కిక్ ఇస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కథాకథనాల పరంగా రొటీన్ పూరి, పెర్ఫార్మెన్స్ పరంగా డిఫరెంట్ బాలయ్య అనేలా ఉన్న ఈ చిత్రం కొత్తదనాన్ని కోరుకునేవారికి, మల్టీప్లెక్స్ ఆడియన్సుకి, ఓవర్సీస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ సినిమా ఇంట్రవెల్ బ్యాంగ్‌లో ఓడైలాగ్ ఉంది. `ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ – అవుటర్స్ నాట్ ఎలౌడ్` అని! సరిగ్గా ఈ సినిమా కూడా అంతే. బాలయ్య ఫ్యాన్స్ కీ, వీరాభిమానులకు, బాలయ్య పేరు చెబితే చొక్కాలు చించుకొనేవాళ్లకూ.. ఈ సినిమా ఓ ఫీస్ట్! మిగిలిన వాళ్లకు రొటీన్ మాస్ మసాలా మూవీ.