ఆ సినిమాను ఫాలో అవుతున్న ఊరు పేరు భైరవకోన
సంక్రాంతి నుంచి తప్పుకున్నందుకు ఈగల్ కు సోలో రిలీజ్ దక్కాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 16కు రిలీజ్ ను వాయిదా వేసుకుంది ఊరు పేరు భైరవకోన సినిమా. సినిమా వాయిదా పడటంతో ప్రమోషన్స్ కు చిన్న బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆదివారం నుంచి స్పీడ్ పెంచాలని మేకర్స్ డిసైడయ్యారు. ఈ సినిమాను సమర్పించిన అనిల్ సుంకర, గతంలో సామజవరగమన మూవీకి చూపించిన నమ్మకాన్నే ఈ సినిమాకూ చూపిస్తున్నాడు.
అందులో భాగంగానే ఊరు పేరు భైరవకోన సినిమాకు ఈ నెల 14 నుంచే తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేయాలని ఆలోచిస్తున్నాడట. దాదాపు కన్ఫర్మే. అధికారిక ప్రకటన కూడా రెండు మూడ్రోజుల్లో వచ్చే ఛాన్సుంది. అయితే ఈ సినిమాకు సానుకూల అంశాలు చాలానే కనిపిస్తున్నాయి. అందులో మొదటిది సినిమా రిలీజ్ టైమ్.
సంక్రాంతి తర్వాత వచ్చిన ఏ సినిమా కలెక్షన్స్ పరంగా మ్యాజిక్ చేసింది లేదు. ఈగల్ కు మంచి టాక్ వచ్చినా థియేటర్లు చాలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకు ఇబ్బంది ఉండదు. ఆపరేషన్ వాలెంటైన్ అదే తేదీకి వస్తుందనుకుంటే ఇప్పుడా సినిమా మార్చి 1కి వాయిదా పడింది. దీంతో ఉన్న ఒక్క కాంపిటీషన్ కూడా లేకుండా పోయింది. దానికి తోడు సినిమాకు ఆడియో చాలా ప్లస్ అయింది. హర్రర్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందని అందరూ నమ్ముతున్నారు. ఆ నమ్మకంతోనే సామజవరగమన ను ఫాలో అవుతూ ఈ సినిమాకు రెండ్రోజుల ముందు నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.













