నరేష్ ఆల్కహాల్ పరిస్థితేంటి?
కామెడీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్(Allari Naresh) ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన ఆసక్తికరమైన సినిమా ఆల్కహాల్(Alcohol) గతేడాది టీజర్ రిలీజ్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. నూతన సంవత్సర కానుకగా 2026 ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించగా, ఇప్పటివరకు రిలీజ్ డేట్‌పై ఎలాంటి క్లారిటీ లేకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీజర్లో కనిపించిన డార్క్ కామెడీ టచ్, నరేష్ కొత్త లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచినా, సినిమా మాత్రం ఇంకా రిలీజ్‌కు నోచుకోలేదు.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మిస్తున్న ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ మెహర్ తేజ్(Meher Tej) దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్గా రుహానీ శర్మ(Ruhani Sharma) నటిస్తుండగా, సోషల్ మీడియా స్టార్ నిహారిక ఎన్ఎం (Niharika NM)తో పాటు ప్రముఖ నటుడు గిరీష్ కులకర్ణి(Girish Kulkarni) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జిబ్రాన్(Ghibran) సంగీతం అందిస్తుండగా, పలువురు అనుభవజ్ఞులైన టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కు పనిచేశారు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తే, ఇది సాధారణ కమర్షియల్ సినిమా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ప్రయత్నంగా అర్థమవుతోంది.
ఇక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆల్కహాల్ షూటింగ్ పూర్తయ్యాక కూడా అల్లరి నరేష్ ఇప్పటికే మరో సినిమాలను పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్స్‌తో బిజీ అయ్యారు. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం ఇంకా రిలీజ్ షెడ్యూల్లోకి రాకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణమా, సరైన రిలీజ్ టైమ్ కోసం ఎదురు చూస్తున్నారా, లేక మార్కెట్ పరిస్థితుల వల్ల ఆలస్యమవుతుందా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తానికి మంచి అంచనాల మధ్య రూపొందిన ఆల్కహాల్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.







