నయనతార చేయిస్తున్న పూజల వెనుక రహస్యం అదే!
సినిమా తారల పెళ్ళిళ్ళు చిత్ర విచిత్రంగా జరుగుతుంటాయి. సినిమాల్లో మనం చూసే విచిత్రాలు వారి నిజజీవితంలో కూడా కనిపిస్తుంటాయి. ప్రేమ అనేది ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవ్వరికీ తెలీదంటారు. అలాగే ఫలానా వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే సమాధానం చెప్పడం కూడా కష్టమే. అలాంటి పవర్ ప్రేమలో ఉంది. అయితే నిజ జీవితంలోని ప్రేమలకు, సినిమాల్లోని ప్రేమలకు తేడా ఉంటుంది. అలాగే సాధారణ వ్యక్తుల ప్రేమలకు, సినిమా వాళ్ళ ప్రేమలకు కూడా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు ఎంత తొందరగా ప్రేమ పేరుతో దగ్గరవుతారో, అంతే తొందరగా దూరమవుతుంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి ప్రేమలు కోకొల్లలు. ఆల్రెడీ పెళ్ళయిన వాళ్ళు భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుంటారు. కొందరు మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మొదటి భార్యతోపాటు రెండో భార్యను కూడా చూసుకుంటారు. ఇక కొంతమంది జీవితాల్లో పెళ్లి అనేది సినిమాల్లోని కథల మాదిరిగా అనేక మలుపులు తిరుగుతుంది. ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న నయనతార పెళ్లి విషయంలో ఎన్నో ట్విస్టులు వెలుగు చూశాయి.
అంతకుముందు తమిళ్ హీరో శింబుతో కలిసి నటించిన వల్లభన్ షూటింగ్ సమయంలో అతనితో ప్రేమలో పడింది నయనతార. ఇద్దరూ కొన్నాళ్లు ప్రేమలో మునిగితేలారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శింబుతో విడిపోయింది. అతని సినిమాల్లో నటించనని చెప్పింది నయన. మరికొన్నాళ్లకు విల్లు అనే సినిమాలో నటిస్తూ ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపిందని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని, త్వరలోనే ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించాడు. పెళ్లి కోసం నయనతార సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టింది. కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. అంతేకాదు, క్రిస్టియన్ అయిన నయనతార ఈ పెళ్లి కోసం హిందూ మతం స్వీకరించింది. ప్రభుదేవాకు ఇదివరకే పెళ్ళయి ఉండడం వల్ల మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, దానికి అతని భార్య ఒప్పుకోలేదు. దీనిపై ఆ భార్యాభర్తల మధ్య ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. చివరికి 2011లో విడాకులు తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రభుదేవా, నయనతార కూడా విడిపోయారు. ఈ విషయాన్ని నయనతార స్వయంగా ప్రకటించింది.
గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్‌తో నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రియుడితో కలసి పలు దేవాలయాలను సందర్శిస్తోంది నయనతార. గతంలో తనకు జరిగిన అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకూడదని అనుకుంటోంది కాబోలు. అందులో భాగంగా త్వరలో కుంభకోణంలోని తిరునగేశ్వరం రాహు దేవాలయాన్ని కూడా సందర్శించి ప్రత్యేక పూజలు చేయనుంది. త్వరలో జరగనున్న తమ వివాహానికి ఏ ఇబ్బందులు ఎదురుకాకూడదన్న ఉద్దేశంతో నయనతార ఈ పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది.













