నాగశౌర్య ‘లక్ష్య’ షూటింగ్ పూర్తయింది
కొంతమందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ కొందరు మాత్రం ఆటకే గుర్తింపును తీసుకొస్తారు. అర్చరీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన ఓ ఆటగాడి ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం లక్ష్య. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. నారాయణదాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్‌మరార్ నిర్మిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నాగశౌర్యకు దర్శకుడు సీన్‌ను వివరిస్తున్న వర్కింగ్ స్టిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. పార్ధు అనే క్రీడాకారుడి జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. నాగశౌర్య, పాత్ర రెండు భిన్న పార్శ్వాల్లో సాగుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం అని తెలిపారు. జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి.













