మిస్టర్ బచ్చన్‌కు పెరుగుతున్న డిమాండ్
ఏదైనా హిట్ సినిమాని మూడు నాలుగేళ్ల తర్వాత వేరే భాషలోకి రీమేక్ చేస్తున్నప్పుడు క్రేజ్ తగ్గడం మామూలే. అప్పటికే సినిమాను ఒరిజినల్ లాంగ్వేజ్ లో చూసేసి ఉంటారు కాబట్టి ఆడియన్స్ కు ఆ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే వకీల్ సాబ్, బ్రో లాంటి రీమేక్ సినిమాలు ఒరిజినల్ కథతో తెరకెక్కిన సినిమాల్లా క్రేజ్ ను అందుకోలేకపోయాయి.
రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ కు కూడా అలాంటి పరిస్థితులే వస్తాయనుకున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోకే తప్పలేదు ఇక రవితేజ సినిమా ఓ లెక్కా అనుకున్నారు. 2018లో వచ్చిన బాలీవుడ్ హిట్ రైడ్ సినిమాకు ఇది అధికారిక రీమేక్ గా తెరకెక్కుతుంది. మొదట్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఎందుకీ రిస్క్ అనుకున్నారు.
దానికి కారణాలు లేకపోలేదు. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండవు. హీరో, విలన్ మధ్య పోటాపోటీ తప్పించి సినిమాలో ఏముండదు. అయినా సరే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అన్నింటికీ సిద్ధపడి ఈ సినిమాను పూర్తి చేసింది. దానికి కారణం ఈ సినిమా కథలో హరీష్ శంకర్ చేసిన కీలక మార్పులే. మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటివరకు రిలీజైన కంటెంట్ ప్రతీదీ ఆడియన్స్ ను మెప్పించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ బిజినెస్ 35 నుంచి 40 కోట్ల మధ్య జరగొచ్చని ట్రేడ్ పండితులంటున్నారు. చూస్తుంటే బయ్యర్లకు ఈ సినిమా మీద మంచి నమ్మకమే ఉన్నట్లుంది. ఆగస్ట్ 15న మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.













