దేవర ప్లేస్ ను రీప్లేస్ చేయనున్న రవితేజ
పాన్ ఇండియా సినిమాలు చెప్పిన డేట్ కు రావడం గగనమైపోయింది. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప2 వాస్తవానికి ఆగస్ట్ 15న రిలీజ్ కావాలి కానీ ఆ సినిమా వాయిదా పడి డిసెంబర్ 6కి వెళ్లింది. దీంతో ఆ డేట్ ను రామ్-పూరీ కలయికలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ లాక్ చేసుకుంది. మరోవైపు సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ ఓజీ పోస్ట్‌పోన్ అవడంతో ఆ ప్లేస్ లోకి ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్ లో వస్తున్న దేవర రిలీజ్ కానుంది.
దేవర వాస్తవానికి అక్టోబర్ 10న రిలీజ్ కావాల్సింది. అంటే దసరా వీకెండ్. అదే రోజున రజినీకాంత్ వేట్టయాన్ కూడా రిలీజ్ కానుంది. దీంతో పాటూ బాలీవుడ్ నుంచి ఎంత లేదన్నా రెండు మూడు సినిమాలు రిలీజవుతాయి. ఆ టైమ్ లో పాన్ ఇండియా సినిమా అయిన దేవరను రిలీజ్ చేయడం మంచిది కాదని సోలో డేట్ కోసమని దేవరను సెప్టెంబర్ 27కు ప్రీపోన్ చేశారు మేకర్స్.
ఇప్పుడు ఖాళీ అయిన అక్టోబర్ 10 మీద రవితేజ కన్నేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ ను అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తైంది. రిలీజ్ కు మంచి స్లాట్ కోసం చూస్తున్న టీమ్ అన్నింటినీ పరిశీలించాక అక్టోబర్ 10కి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ తెలుగులో మాత్రమే రిలీజవుతుంది కాబట్టి రజినీ సినిమాను తట్టుకుని నిలబడే అవకాశాలు బాగానే ఉన్నాయి. త్వరలోనే మిస్టర్ బచ్చన్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్డేట్ అధికారికంగా వెలువడే ఛాన్సుంది.













